భారత్ ను భారత్ లాగే వుంచండి : మోహన్ భాగవత్
భారత్ ను భారత్ లాగే వుంచాలని, దానిని అనువదించొద్దని లేదా మార్చకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు.ఈ సందర్భంగా భారత్ అనే అర్థం వెనుక వున్న సాంస్కృతిక గుర్తింపును బలంగా నొక్కి చెప్పారు. కొచ్చిలో జరిగిన జ్ఞాన్ సభ నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడారు.
అధికారం, శ్రేయస్సు, జాతీయ ఆత్మగౌరవంపై తిరిగి అందరూ దృష్టి నిలపాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భారత్ ను భారత్ లాగే వుంచాలని, అనువదించొద్దని, భారత్ అనేది సరైన నామవాచకమని బలంగా నొక్కి చెప్పారు. ఇండియా ని భారత్ అని అనడం వాస్తవంగా సరైనదే కావొచ్చు గానీ.. భారత్ ని ఎప్పుడూ వేరే పేరుతో మాత్రం పిలవకూడదని అన్నారు. భారత్ అంటే భారత్ అంతే అని నొక్కి వక్కాణించారు.
అయితే.. పౌరులందరూ వ్యక్తిగత సంభాషణల్లో లేదా సంభాషణల్లో, ప్రసంగాల్లో, రచనల్లో భారత్ ను భారత్ గానే ఉపయోగించాలని కోరారు. పేరు వెనుక గుర్తింపు వుంటుందని, గౌరవం వుంటుందని, అది ఆకర్షిస్తుందన్నారు. పదం వెనుక వున్న అసలు స్వభావాన్ని విడిచిపెట్టేసిన దేశం ఎంత సమర్థవంతంగా వున్నా.. సద్గుణవంతంగా వున్నా.. ఎప్పటికీ గౌరవం దక్కించుకోదన్నారు. భారత్ ను భారత్ లాగా పిలిస్తేనే గుర్తింపు, గౌరవం వుంటుందన్నారు.
విద్యా విధానంలో భారతీయతను తిరిగి తీసుకురావాలంటే మనం మొదట భారత దేశాన్ని తెలుసుకోవాలని, దాని గుర్తింపును బలంగా నమ్మాలని సూచించారు. భారత్ ను తెలుసుకోవాలని, భారత్ ను నమ్మాలని,ఇదే భారతీయత అని మోహన్ భాగవత్ అన్నారు.విద్య మన కడుపు నింపుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. కానీ.. భారతీయ మూలాలున్న విద్య మాత్రం ఇతరుల కోసం జీవించడం నేర్పుతుందన్నారు.అలాగే విద్య కేవలం పాఠశాలలో మాత్రమే బోధించేది కాదని, ఇంట్లో ఇచ్చే విలువల ఆధారంగా కూడా ఆధారపడి వుంటుందన్నారు. దీని విషయంలో సమాజానికి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర వుందన్నారు. విలువలు ప్రవర్తనను అందిస్తాయని, ప్రవర్తన జీవితంలో పురోగమనానికి దారితీస్తుందన్నారు.