నీటి వాడకం తక్కువగా వుండే పంటలు ప్రోత్సహించాలి : భారతీయ సంస్కృతి ఉత్సవ్ లో వక్తలు
హరిత విప్లవం మోడల్ వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేసిందని ఖేతి విరాసత్ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమేంద్ర దత్ అన్నారు. వాటి పరిణామాలను దేశం ఇప్పుడు ఎదుర్కొంటోందన్నారు. కర్నాటక కేంద్రంగా జరుగుతున్న భారతీయ సంస్కృతి ఉత్సవంలో భాగంగా జరిగిన గ్రామ కృషి సమ్మేళనం జరిగింది. ఐదు నదులు ప్రవహించే పంజాబ్ నేడు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, హరిత విప్లవం ప్రభావంతో రసాయనాలు, నీటి వాడకం పెరిగిపోయిందన్నారు. పంజాబ్ లో 2000 సంవత్సరంలో ఒకే ఒక్క కేన్సర్ ఆస్పత్రి వుండేదని, కానీ.. ఇప్పుడు 300 కి పెరిగిందని పేర్కొన్నారు. అలాగే అప్పట్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఒక్కటి కూడా లేని దశ నుంచి ఇప్పుడు 100 కి పైగా వున్నాయన్నారు. ఇది ప్రగతి నమూనానే కాదని, ప్రకృతి కేంద్ర అభివృద్ధి జరగాలని సూచించారు. భారత్ ఈ దిశలో పునర్నిర్మాణం చెందాలని సూచించారు.
ఇక.. రానూ రానూ ప్రకృతిలో మార్పులు వస్తున్నాయని, దీనికి తగ్గట్టుగానే పంటల పండించే విధానం రావాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత పొపట్ రావు పవార్ అన్నారు. నీటి వాడకం తక్కువగా వుండే పంటలు వేయాలని, అలాగే నీటికంటూ ఓ బడ్జెట్ వుండాలని కూడా సూచించారు. అందరి సహకరాంతో తమ గ్రామాన్ని తాము తయారు చేసుకున్నామని, తమ గ్రామంలో ఒక్క పేదవాడూ లేడన్నారు. రైతులు వ్యవసాయానికి ఉద్యానవన పంటలు, పశుపోషణ, ఆగ్రో ఫారెస్ట్ గా విభజించుకొని, సాగు చేస్తే లాభాలు వుంటాయని సూచించారు.