గోకృషి వాణిజ్య వ్యవస్థను విస్తరించండి : రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు

భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు నాగపూర్ లోని రేషంబాగ్ స్మృతి మందిర్ కాంప్లెక్స్ లో జరిగాయి. ఈ సందర్భంగాలు పలు ప్రధానమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు వుంచారు. మరీ ముఖ్యంగా దేశంలోని రైతులు గోకృషి వాణిజ్య వ్యవస్థను భారీ ఎత్తున స్వీకరించి, ఆచరణలోకి తేవాలని పిలుపునిచ్చింది. దీని ద్వారా రసాయన రహిత, విషరహిత వ్యవసాయ ఉత్పత్తులను పౌరులకు అందించవచ్చని కిసాన్ సంఘ్ సూచించింది. అందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ సమగ్రమైన, ఆచరణాత్మకమైన, బలమైన వ్యవస్థగా గోకృషి వాణిజ్య వ్యవస్థను అమలు చేయాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది.

దేశంలో ఆహార ధాన్యాలు విషపూరితం అవుతున్నాయని, కలుషితం కూడా అవుతున్నాయని ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణాంతక పురుగుమందులు, కలుపు మందులు, బయో-స్టిమ్యులెంట్లు, హార్మోన్ ఉత్పత్తుల కారణంగా మన ఆహార ధాన్యాలు చాలా వరకు విషపూరితం కావడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ పరిశోధనల నుండి పొందిన సమాచారం ప్రకారం, అల్జీమర్స్, క్యాన్సర్, చర్మ వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణం రసాయన వ్యవసాయంతోనే జరుగుతోందని తేల్చి చెప్పింది.

ఆంగ్లేయులు భూ ఆధారిత అవసరాలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో 1894 లో భూసేకరణ చట్టాన్ని రూపొందించారని, దీంతో రైతులు తీవ్ర దోపిడీకి గురయ్యారని కిసాన్ సంఘ్ పేర్కొంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం అమలులో వుందని, దీనిని 1962, 1984 లో సవరించారన్నారు. 2013 లో భూసేకరణ,పునరావాసం, న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.

భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది, ఇది వివిధ రాష్ట్రాల్లోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చిందని ప్రతినిధులు పేర్కొన్నారు. అందులో కొన్నింటిని అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రస్తావించింది.

1. ప్రభుత్వం వ్యవసాయ భూమిని తీసుకున్న తర్వాత కూడా రైతులకు పరిహారం అందడం లేదు. ఒకవేళ ఇచ్చినా.. మార్కెట్ ధర కంటే ధర తక్కువగా వుంటోంది. ఆ డబ్బులను కూడా సకాలంలో చెల్లించడం లేదు.

2.రైతులకు ఉపాధి, ప్లాట్లు, ఉద్యోగాలు వంటి హామీలు ఇచ్చినా… అవి నెరవేరడం లేదు.

3. కొన్ని చోట్ల భూమికి బదులుగా అన్ని సౌకర్యాలున్న ప్లాట్లను కూడా ఇవ్వడంపై చర్చ చేస్తున్నారు. దీని కోసం చట్టాలు కూడా వచ్చాయి. కానీ ఈ చట్టాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌లో, ఇటీవల ఎంపీ నగర్ తాతా గ్రామ్ నివేష్ (సవరణ) బిల్లు 2025లో సెక్షన్ 66 (ఎ) జోడించబడింది. దీనిలో అభివృద్ధి చెందిన ప్లాట్‌కు నిర్వచనం లేదు, ఎంత భూమిని చెల్లించాలి, భూమిని ఎక్కడ చెల్లించాలి, ఇది కూడా అందులో లేదు. ఎప్పుడిస్తారు? ఎంత కాలం పడుతుందో కూడా ఆ చట్టంలో లేదు. అలాగే రైతు పరిహారాన్ని మాత్రమే కోరుకుంటే ఆ ఆప్షన్ అందులో లేదు. అభివృద్ధి చేసిన ప్లాట్ల కేటాయింపులో రైతు ప్రాధాన్యత లేదు. జీవనోపాధికి ఎలాంటి ఏర్పాట్లు అందులో లేవు.

4. కొన్ని ప్రదేశాలలో అయితే భూమిని స్వాధీనం చేసుకున్న తర్వా త మిగిలిన భూమి నీటిలో మునిగిపోతోంది. సాగుకు అనుగుణంగా వుండటం లేదు. దీంతో రైతులకు కష్టంగా మరిపోయింది.

భూసేకరణ చట్టాన్ని రైతుకు అనుగుణంగా మార్చాలని ఓ తీర్మానాన్ని కిసాన్ సంఘ్ ఆమోదించింది. వ్యవసాయ భూమిని సేకరించే ముందు దేశంలో అందుబాటులో వున్న బంజరు భూమి విషయంలో సర్వే చేయాలని ప్రభుత్వాలకు కిసాన్ సంఘ్ సూచించింది.

ప్రభుత్వాలకు కిసాన్ సంఘ్ చేసిన సూచనలివే…

1. సేకరించిన భూమికి పరిహారం చెల్లించే సమయానికి మార్కెట్ ధరకు కనీసం 4 రేట్లు రెట్టింపై వుండాలి. రైతు చేతికి ఆ పరిహారం చేతికి వచ్చిన తర్వాతే ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకోవాలి. అలా కాకుండా రైతును అక్కడి నుంచి పంపిచేస్తే అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

2. రైతుకు అన్ని పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాగే ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టినా.. అది రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ మొదలైన సుంకాల నుంచి మినహాయింపునివ్వాలి.

3. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చాలి. ఉద్యోగాలివ్వడం, ఇతర ప్రాంతాల్లో భూమినివ్వడం మొదలైన ప్రక్రియలు తొందరగా పూర్తి చేయాలి.

4. అభివృద్ధి చేసిన ప్లాట్లకి బదులుగా లేదా రైతు కోరుకున్న ఇతర ప్లాట్ ఒకేసారి పొందే అవకాశం కల్పించాలి. అలాగే అభివృద్ధి చేసిన ప్లాట్ కేటాయింపులో రైతు ఎంపికకే అధిక ప్రాధాన్యతనివ్వాలి.

5. భూమిని సేకరించిన తర్వాత కూడా రైతు వద్ద వున్న వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలని రైతు భావిస్తే.. ఆ భూమికి కూడా అదే రేటును ఇవ్వాలి.

6. రోడ్డు, రైల్వే లైన్ మొదలైన అభివృద్ధ కార్యక్రమాల సమయంలో భూమి ఎత్తు పెరిగితే, రైతు తన వ్యవసాయాన్ని జాగ్రత్తగా చేసుకునేలా ప్రతి 2 కిలోమీటర్లకు దిగువ బైపాస్ నిర్మించాలి.

7.ఆనకట్ట వంటి ఏదైనా పెద్ద ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ప్రభుత్వం సేకరించిన అదనపు భూమి ప్రభుత్వం వద్దే ఉంటే, ఆ భూమిని అదే రైతుకు తిరిగి ఇవ్వాలి.

8. రాబోయే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందే భూమిని సేకరించిన తర్వాత, ఏదైనా కారణాల రీత్యా ఆ ప్రణాళిక రద్దైతే.. ఆ భూమిని అదే రైతుకు లేదా అతని వారసులకు జాగ్రత్తగా అప్పగించాలి.

ప్రభుత్వాల ముందు వుంచిన డిమాండ్లు:

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో, “గౌ-కృషి వాణిజయం” ఆధారంగా “ఆరోగ్యకరమైన భారతదేశం, పోషక భారత్” కోసం, అఖిల భారత కార్యవర్గ సమావేశం ప్రధానమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచింది:

1. అన్ని వ్యవసాయ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో రసాయన అవశేషాలకు ప్రమాణాలను నిర్ణయించాలి.

2. దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలు, ధాన్యాలతో పాటు జీఎం లేని వాటిపై నాణ్యతా తనిఖీలను తప్పనిసరి చేయాలి. జీఎం లేని ఆహారాన్ని నిర్ధారించడానికి కఠినమైన చట్టాలను రూపొందించాలి.

3. ఆవు ఆధారిత సేంద్రీయ ఆహారం కోసం ఉత్పత్తి కొనుగోలు, మార్కెటింగ్, నిల్వ, పంపిణీ, బ్రాండింగ్, సరళమైన ధృవీకరణకు స్వతంత్ర, ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఆవు ఆధారిత సేంద్రీయ ఆహారంలో గరిష్ట రసాయన అవశేషాలకు ప్రమాణాలను నిర్ణయించాలి. ఫలితంగా, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో, విదేశాలలో సరసమైన ధరలకు సులభంగా అమ్ముకోవచ్చు. పైగా ప్రధాన స్రవంతిలో సేంద్రీయ ఆహారాన్ని రసాయనాలతో కల్తీ చేసినందుకు దోషులను నేరస్థులుగా కఠినంగా శిక్షించేలా ఒక చట్టం చేయాలి.

4. వ్యవసాయం-పోషకాహార-ఆరోగ్య వ్యవస్థను విధాన రూపకల్పనలో సమగ్రపరచాలి. దీని కోసం అంకితమైన పరిశోధన, వనరులను నిర్ధారించాలి. తద్వారా ఆవు ఆధారిత సేంద్రీయ వ్యవసాయం సమగ్ర విధానంపై ఆధారపడిన శాస్త్రీయ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చు. రైతులు దానిని సులభంగా, నమ్మకంగా, ఆచరణాత్మకంగా స్వీకరించవచ్చు.

5. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి, ‘ఆరోగ్యకరమైన భారతదేశం, పోషక భారతదేశం’ కోసం ‘ఆవు-వ్యవసాయ వాణిజ్యం’ ఆధారంగా ఒక దృఢమైన వ్యూహాన్ని అవలంబించాలి.

6. మార్కెట్‌లో ప్రాణాంతకమైన, నిషేధిత, తక్కువ నాణ్యత గల పురుగుమందులు, కలుపు మందులను, రసాయన ఎరువులను విక్రయించే కంపెనీలపై కఠినమైన చట్టాలను అమలు చేయాలి. ఇది మార్కెట్‌లో రైతుల మోసాన్ని ఆపుతుంది.

 

కాగా, ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన సంస్థాగత, ఆందోళనాత్మక, నిర్మాణాత్మక అంశాలతో పాటు, సంస్థ విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను చర్చించారు. దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల నుండి కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.  ఆర్ఎస్ఎస్ అఖిల భారత  కాంటాక్ట్ ప్రముఖ్, రామ్‌లాల్, కిసాన్ సంఘ్ అఖిల భారత సంఘటన కార్యదర్శి దినేష్ కులకర్ణి ముగింపు సమావేశాలు మార్గదర్శకత్వం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *