వ్యవసాయ రంగ అనుకూల బడ్జెట్: సంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ కిసాన్ సంఘ్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భారతీయ కిసాన్ సంఘ్ సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ అనుకూలమైందని, రైతు అనుకూల ప్రయోజనాలను ప్రోత్సహించే ఈ బడ్జెట్‌ను భారతీయ కిసాన్ సంఫ్‌ు స్వాగతిస్తోందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహినీ మోహన్ మిశ్రా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి, ధాన్యాల అధిక ఉత్పాదకతకి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, అలాగే.. వాతావరణ మార్పుల దృష్ట్యా వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించిన పరిశోధనలకు కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని హర్షం వ్యక్తం చేశారు.దీంతో పాటూ వాతావరణానికి అనుగుణంగా రైతులకు 32 రకాల ఉద్యానవన పంటలు, 109 అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల ఉద్యానవన పంటలకు రైతులకు అందజేయాలని నిర్ణయించడం కూడా ఓ మంచి ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
అయితే.. అధిక దిగుబడి పేరుతో జన్యుమార్పిడి పంటలకు అనుమతినిస్తే మాత్రం కిసాన్ సంఘ్ కచ్చితంగా వ్యతిరేకిస్తుందని మాత్రం ఆయన హెచ్చరించారు. వచ్చే రెండు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండిరగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తామని ప్రకటించడం కూడా హర్షనీయమని అన్నారు. దీని ద్వారా విషరహిత వ్యవసాయం వైపు ప్రభుత్వం ప్రజల్ని తీసుకెళ్లడానికి వీలవుతుందన్నారు. కూరగాయలు ఉత్పత్తి చేసే రైతు కోసం క్లస్టర్లను రూపొందించి, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో రైతులను స్వావలంబన చేసే దిశగా బడ్జెట్‌ను పొందుపరిచారని, అలాగే వీటి ఉత్పత్తులు, మార్కెటింగ్ విషయంలో కూడా ఇందులో కేటాయింపులు వున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు ఐదు రాష్ట్రాలలో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డును తయారు చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా ద్వారా దేశంలోని 400 జిల్లాల్లో ఖరీఫ్ పంటలను సర్వే చేస్తామనడం కూడా స్వాగతించదగ్గదే అని మోహినీ మోహన్ మిశ్రా పేర్కొన్నారు.