భారతీయ నారి హిందూ కుంటుబానికి ఆధారం -1

కుటుంబప్రబోధన్‌

భారతదేశంలో స్త్రీకి ఒక విశిష్ఠ స్థానాన్నిచ్చాం. హిందూ జీవన విధానంలో, హిందూ కుంటుంబ వ్యవస్థలో తల్లికి, స్త్రీకి మనం అధిక ప్రాధాన్యత నిచ్చాం. మహిళ బహుముఖంగా పనులు చక్కబెట్టి మన జీవన విధానాన్ని బలోపేతం చేస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, ఉద్యోగిగా, ఇంటి వ్యవహారాలను చక్కబట్టే సంధానకర్తగా, భర్త సంపాదనను జాగ్రత్తగా ఖర్చుచేసే, పొదుపు చేసే ఇల్లాలుగా, వీరనారిగా, రచయిత్రిగా, రాజనీతి కోవిదురాలుగా, న్యాయవాదిగా, వైద్యురాలిగా ఇలా అనేక పాత్రలలో అమ్మ హృదయంతో పనిచేస్తుంది. ఎందరో సాధ్విమనుణులు సైతం ఉన్నారు. ఆ కాలం నాటి గార్గి, మైత్రేయి వంటి విదుషీమణులు  వారికున్న బుద్ధిబలం వల్ల ఋషిస్థానాన్ని పొందారు. మీరా, ముక్తాబాయి, సక్కుబాయి లాంటి భక్తి యోగినులు, లీలావతి, ఖానాదేవి మొదలైన మేధావులు డొక్కా సీతమ్మ వంటి ఉదార హృదయులు చరిత్రలో ఆదర్శవనితలుగా నిలచి పోయారు. సనాతన ధర్మాన్ని ఆచరణలో చూపిన ఘనత మహిళలదే. స్వామి వివేకానంద ‘ఏ దేశం స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉన్నతస్థితని పొందలేదు’ అన్నారు. నేడు మహిళలు, విద్యాధికులై, అధ్యాపక వృత్తిలోనే కాక, శాస్త్రజ్ఞులుగా, సైన్యాధి కారులుగా కూడా రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా శక్తి మంతులవుతున్నారు. స్వేచ్ఛలో కృషిలో, శక్తియుక్తులతో ప్రతిభను కనబరచడంతో బాటు, వారసత్వ సందను పంచడంలోనూ, మత ధర్మాలను ఆచరించడంలోనూ పూర్వపు నారీమణులను ఆచరించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మన హిందూ జీవన విధానంలో ఉన్న ప్రత్యేకత ఇంది.

వివాహల్లో వధూవరులకు అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. పాతివ్రత్యం, సౌశీల్యం వల్లనే వశిష్ఠ మహర్షి భార్య అరుంధతికి ఆ స్థాయి దక్కింది. వశిష్ఠ, అరుంధతులు తమ జీవితాలను తపశ్చర్య లకు, సేవలకు అంకితం చేశారు. వారికి ఏడుగురు కుమారులు జన్మించారు. అంతా ఋషులయ్యారు. అరుంధతి హిమాలయాల్లో వచ్చిన కరువుకు స్పందించి వానలు కురిసేందుకు తపస్సు చేసింది. సీతాదేవికి కూడా పాతివ్రత్య ధర్మాలను, గృహిణి ధర్మాలను వివరించి చెప్పింది అరుంధతి. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి వానలు కురిసేలా చేశాడు. పవిత్ర సరస్వతీ తీర్థం వద్ద వశిష్ఠ మహర్షి అరుంధతి దంపతులు తీవ్రంగా తపస్సు చేసి చివరికి గగనతలంలో నక్షత్రాలయ్యారు.

అలాగే అత్రిమహాముని సతీమణి అనసూయ మహా పతివత్ర. రామాయణ కాలంలో వనవాసంలో ఉన్న సీతారాములు స్వయంగా అత్రిమహా ముని ఆశ్రమాన్ని దర్శించారు. పతిని త్రికరణశుద్ధిగా సేవించమని సీతకు అనసూయ బోధించింది. సీతాదేవికి అతి పవిత్రమైన ఎన్నటికి వాడని పుష్పమాలను బహుకరించింది. మాండవ్యుడు అనే ఋషి ఏదో కారణం చేత ఒక సచ్ఛీలుణ్ణి సూర్యోదయం అవుతూనే చనిపోతాడని శపించాడు. ఆ సచ్ఛీలుడి భార్య సుమతి, తానే కనుక మహా పతివ్రతనైతే సూర్యోదయం ఎన్నటికీ కారాదంటూ ఆనపెట్టింది. తరువాత లోకమంతా కారుచీకట్లు కమ్మాయి. అంతా అనసూయ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అనసూయ సుమతితో మాట్లాడి ప్రతిజ్ఞను ఉపసంహరించుకుంటే పతికి ప్రాణం పోస్తానంది. అనసూయ మాట మన్నించింది సుమతి. సూర్యోదయమయింది. లోకం సంతోషించింది, కాని సుమతి భర్త చనిపోయాడు. అనసూయ తన తపశక్తితో అతణ్ణి బ్రతికించింది. ఆ సమయంలో ఏదైనా వరం కోరుకొమ్మని దేవతలు అనసూయ నడిగారు. త్రిమూర్తులే తనకు బిడ్డలుగా  జన్మించాలని కోరుకుంది. ఆ వరంవల్ల త్రిమూర్తుల అవతారంగా దత్తాత్రేయుడు జన్మించాడు.

శర్యాతి మహారాజు ఏకైక కుమార్తె సుకన్య. ఆమె చదువులో సరస్వతి, అందంలో శచీదేవి. ఆమె ఒకసారి వనవిహారంలో ఉండగా చ్యవనుడు అనే ఋషి తపస్సు వల్ల ఆయన చుట్టు పుట్ట ఏర్పడిరది. వనవిహారంలో కోలాహలం వల్ల ఆయనకు తపోభంగమై కళ్లు తెరిచాడు. అవి రత్నాలుగా మెరిశాయి. పుట్ట రంధ్రం నుండి మెరుస్తున్న ఆ నేత్రాలను చూసి సుకన్య అవి ఏమిటా అని ముల్లుతో గుచ్చింది. మహర్షి స్పందించలేదు. కాని వనవిహారంలో ఉన్న శర్వాతి రాజు పరివారం, అందరికీ మలమూత్రాలు స్తంభించి ఇబ్బంది పడ్డారు.

రాజు పశ్చాత్తాపడి చ్యవనుడి సేవకై తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. అందరికీ ఆపద తొలగిపోయింది. సుకన్య పెళ్ళి తరువాత ఆశ్రమ జీవితం ప్రారంభించింది. ఆశ్రమ జీవితానికి అనుగుణంగా జీవనం సాగిస్తూ భర్తకు సేవ చేసింది. ముని వాటిక మీదుగా వెళ్ళే అతిథులకు అమ్మలాగ అన్నీ అందింది. ఒక రోజు అశ్వనీ దేవతలు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించారు. అందులో ఆమె విజయం సాధించింది. అశ్వనీ దేవతలవల్ల మళ్లీ కళ్లు వచ్చిన చ్యవనుడితో కలిసి ఆదర్శ జీవనం సాగించింది.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *