గ్రామ స్థాయిలో ‘తోలుబొమ్మలాట’కి ప్రాణం పోస్తూ… ప్రపంచ యవనికపై గుర్తింపు తెచ్చిన భీమవ్వ
తోలు బొమ్మలాట… ఒకప్పుడు ప్రజలను విశేషంగా ఆకర్షించిన కళ. ఆధునిక యుగంలో వచ్చిన సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల కారణంగా ఈ కళ కాస్త వెనకపడ్డా… ఇప్పటికీ విశేష ఆకర్షణే. ఇప్పుడు ఈ కళ మరోసారి దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. కర్నాటకలోని కొప్పళ్ల జిల్లాకి చెందిన 96 సంవత్సరాల భీమవ్వ దొడ్డబల్లప్ప సిలేక్యాతారకి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం. తోలుబొమ్మలాటలో ఈమె విఖ్యాతి గాంచారు. తన 14 వ ఏట నుంచే తొలుబొమ్మల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ తోలుబొమ్మలాట తన కుటుంబ వారసత్వంగా వస్తోంది. గత 70 సంవత్సరాలుగా రామాయణ, మహా భారతాలతో పాటు మన సంప్రదాయాలను ఈ తోలు బొమ్మలాట మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామీణులు, పెద్ద పెద్ద నగరాల్లో జీవించే వారిపై విశేష ప్రభావమే చూపుతోంది.
అంతేకాకుండా ఇప్పుడు పర్యావరణం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. దీనిపై భీమవ్వ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. తోలు బొమ్మలాట కళ ద్వారా కూడా పర్యావరణం, చెట్ల పెంపకం, నీటి సంరక్షణపై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కేవలం మన భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భీమవ్వ తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తుంటారు. జపాన్, జర్మనీ, సౌదీ అరేబియాతో పాటు 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తోలు బొమ్మలాట గ్రామీణ కళ అని, తనలో ఊపిరి ఉన్నంత వరకూ దీని ఉనికిని విశేషంగా కాపాడతానని భీమవ్వ ఎప్పుడో ప్రకటించారు. అలాగే గ్రామ స్థాయిల్లో విశేషంగా దీనికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు.అలాగే తరువాతి తరాలకు కూడా ఈ కళ వ్యాప్తి కావాలని ఆసక్తి వున్న వారికి ఈ కళ నేర్పిస్తున్నారు.
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతూ మారిపోతోంది. సోషల్ మీడియాతో పాటు ఆధునిక కళలూ వచ్చేశాయి. అయినా వాటిని తట్టుకుంటూ తోలు బొమ్మలాటను విశేషంగా వ్యాప్తి చేస్తున్నారు. అలాగే దీనిని పరిరక్షించడానికి కూడా కృషి చేస్తున్నారు.