సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌

ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు బిందేశ్వర్‌ పాఠక్‌(80) కన్నుమూశారు. న్యూఢల్లీిలోని సులభ్‌ క్యాంపస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్‌కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్‌ ఎమర్జెన్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సులభ్‌ శానిటేషన్‌ అండ్‌ సోషల్‌ రిఫార్మ్‌ మూవ్‌మెంట్‌ ఆయన ప్రారంభించారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన పాఠక్‌.. కమ్యూనిటి పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు.

1943లో బీహార్‌ రాష్ట్రంలోని హాజీపూర్‌లో బిందేశ్వర్‌ పాఠక్‌ జన్మించారు. సఫాయీ కర్మచారి కుటుంబాలతో కలిసి ఉండి, వారి కష్టాలను తెలుసుకున్నారు.

1970లో సులభ్‌ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు. సాంకేతిక ఆవిష్కరణ, మానవతా సూత్రాల సమ్మిళితంగా పనిచేయడమే దాని ఉద్దేశం. ఈ సంస్థ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ వంటివాటిని ప్రోత్సహిస్తుంది. ఈ సులభ్‌ ఇంటర్నేషనల్‌ కింద ఇండ్లలో 13 లక్షల టాయిలెట్లు, 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లు నిర్మించడం గమనార్హం. ఇందుకోసం అత్యంత చవకైన టుపిట్‌ సాంకేతికతను ఉపయో గించారు. మానవ వ్యర్థాలను మనుషుల ద్వారా శుభ్రపరచడాన్ని ఈ సంస్థ వ్యతిరేకించింది. దీనిని రద్దు చేసేందుకు ఉద్యమాన్ని నడిపింది.

ఈ క్రమంలో ఏళ్ల తరబడి సమాజంలో నాటుకుపోయిన ఈ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చింది. ఎలాంటి రక్షణ తొడుగులు లేకుండా వ్యర్థాలను తమ చేతులతో తొలగించే విధానాన్ని పాఠక్‌ తీవ్రంగా ఖండిరచారు. సఫాయీ కర్మచారీ జీవితాల్లో ఆయన తీసుకువచ్చిన మార్పునకు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం వంటి విషయాల్లో ఆయన చేసిన కృషికి గానూ ఎన్నో అవార్డులు కూడా పాఠక్‌ను వరించాయి. 1991లో కేంద్ర ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురష్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. పాఠక్‌ భారత రైల్వేకు చెందిన స్వచ్ఛ రైల్‌ మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు.  2016లో న్యూయార్క్‌ నగరం ఏప్రిల్‌ 14ని ‘బిందేశ్వర్‌ పాఠక్‌ డే’గా ప్రకటించడంతో పాఠక్‌ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.

బిందేశ్వర్‌ పాఠక్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన స్వచ్ఛభారత్‌ మిషన్‌కు అనిర్వచనీయమైన సహకారం అందించారని ప్రధాని మోడీ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

సులభ్‌ ఇంటర్నేషనల్‌ స్థాపించి సఫాయీ కర్మచారి అభ్యున్నతికి కృషి చేసిన బిందేశ్వర్‌ పాఠక్‌ గారి మృతి పట్ల సామాజిక సమరసతా అఖిల భారత కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ గారు సంతాపాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *