పుట్టినరోజు పండుగ

మన హిందూ పద్ధతిలో ‘పుట్టినరోజు’ జరుపుకోవడం ఓ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. తిథుల ప్రకారం పుట్టిరోజు జరుపుకోవాలి. మహాపురుషులు శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమినాడు పుట్టాడు. మనం శ్రీరామ నవమి జరుపుతాం. శ్రీ కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమినాడు పుట్టాడు. కృష్ణాష్టమి మనకు పర్వదినం. శంకరాచార్యుల వారు వైశాఖ శుద్ధ పంచమినాడు, నారదుడు వైశాఖ బహుళ విదియనాడు జన్మించారు. జన్మదినం తిథి, వార, నక్షత్రంతో బాటు మన తెలుగు సంవత్సరం కూడా తెలిసి ఉండడం మంచిది. తేదీ చెప్పినా జ్యోతిష్యకారులు మనకు ఈ వివరాలు అందిస్తారు. ఇందులో మనదైన పద్ధతిని పాటిస్తున్నామన్న గర్వం, ఆనందం ఉంటాయి. మన కుంటుంబంలో అందరికీ తెలుగు సంవత్సరాలు (60), నెలలు, ఋతువులు, తిథులు తెలియడం అవసరం. ఇది కూడా భజ (తెలుసుకోవడం)లో భాగం.

పుట్టిన రోజు నాడు ఉదయమే లేచి తలకు నువ్వుల నూనె పెట్టుకుని, తలతో పాటు వంటికి కూడ నూనె పట్టించడం, తరువాత స్నానం చేయడం మంచిది. స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకోని స్నానం చేయాలి. తరువాత జన్మనిచ్చిన విధాతను పూజించాలి. పెరుగుతో చేసిన దద్ధోజనాన్ని ప్రసాదంగా భగవంతుడికి నివేదించి, తను తిని శుభ్రంగా చేతులు కొడుక్కొని, యిరుగుపొరుగు వారికి, అనాధలకు, వృద్ధులకు అవిటివారికి పంచిపెట్టాలి. స్తోమత కలిగినవారు అన్న, వస్త్ర, వస్తుదానాలు చేస్తే మంచిది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు పాదనమస్కారం చేయాలి. తల్లిదండ్రులు స్వర్గస్థులైతే వారిని స్మరించి వారి చిత్రపటాలను మాలలతో అలంకరించాలి. అపమృత్యు పరిహారం (అంటే అకస్మిక మృతి) కోసం ఆయుష్య హోమం చేయాలి. ఈ హోమం వ్యక్తికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా చేస్తుంది. మృత్యుంజయ హోమం కూడా చేయవచ్చు.

సప్త చిరంజీవులైన అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృష్ణుడు, పరశురాముడు, వ్యాసుడు`వీరిని స్మరించాలి, వీరితో బాటు శివానుగ్రహంతో మృత్యుంజయుడైన మార్కండేయుణ్ని కూడా స్మరించుకోవాలి. పుట్టిన రోజున క్షవరం, గోళ్ళు తీయడం, పోట్లాడడం, ప్రయాణం, మాంస భోజనం, హింస విడిచిపెట్టాలి. సప్తచిరంజీవులు వారు చేసిన మంచిపనుల వల్ల, ధర్మాచరణవల్ల చిరంజీవులైనారు. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి క్రింది మంత్రం చదువుతూ దీపం వెలిగించాలి.

‘ఉద్దీప్యస్య జాతవేదో  ఏ ఘ్నన్నిర్‌ ఋతింమమ

పశూగ్‌ంశ్చ మప్యా మానవ జీవనంచ దిశోదిశ’

(ఓ జాతవేదుడవైన అగ్ని! చక్కగా ప్రకాశ వంతముగా వెలిగి మాయందున్న పాపమను చీకటిని పోగొట్టుము. చక్కని ఇంద్రియములను, సుఖమైన జీవనమును, మంచి దృష్టినిమ్ము)

తరువాత పాలలో తేనెకలిపి దీపము దగ్గర ఉంచవలెను. దీపము నమస్కరించి మృత్యుంజయ మంత్రం చదువుకోవాలి.

‘ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । ఉర్వారుకమిప బంధనాత్‌ మృత్యోర్ము క్షీయమామృతాత్‌॥’

(పుష్టిని వృద్ధి చేయునట్టి, మంచి సువాసన కలుగజేయునట్టి మూర్తియగు త్రినేత్రుని మేము ఆరాధించుచున్నాము. పండిన డోసపండును తొడిమ నుంచి వేరు చేసినట్లు మమ్ము మృత్యువు నుండి  వేరుచేసి అమృతత్వము చేర్చునుగాక!)

మంచిపనులు చేసేందుకే మన జన్మ. అందుకే మనకు సహజమైన మరణం సిద్ధించాలని ఆకాంక్ష. షష్ఠిపూర్తి (60 సంవత్సరాలు నిండిన) తరువాత మరో 60 ఏళ్ళు జీవితం సజావుగా సాగాలని షష్ఠి పూర్తినాడు నక్షత్ర జపాలు, మృత్యుంజయ హోమం. ఆయుష్షు హోమం  నిర్వహిస్తారు. ప్రతి పుట్టిన రోజు హిందువుకు ఆయువు తగ్గడం గుర్తుచేసినా మంచిపనులు చేసి ఆయువు నిలుపుకొనే సంకల్పాన్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *