పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్యకు బిఎల్ఏ మద్దతు
చర్చల తర్వాత పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే, దానికి తాము మద్దతు ఇస్తామని పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ తో భారత్ చర్చలు జరపనున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది. భారతదేశానికి సైనిక శక్తిగా నిలుస్తామని, పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌పై దాడి చేస్తామని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ శాంతి, కాల్పుల విరమణ ప్రకటనలను మోసంగా అభివర్ణించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని పేర్కొంది.
పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పేర్కొంది.పాకిస్తాన్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. పాకిస్తాన్‌పై దాడి చేయాలని నిర్ణయించుకుంటే పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.