ప్రేమ, త్యాగం, బలిదానం, సైద్ధాంతికతే బీఎంఎస్ పునాదులు : దత్తాత్రేయ హోసబళే

భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది శ్రమ జీవుల, కార్మికుల సంఘటన అని, దేశ ఆర్థిక రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులే శ్రమజీవులు, కర్షకులు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఇన్ని రోజుల తర్వాత తిరిగి తెలంగాణ ప్రాంతంలో బీఎంస్ రాష్ట్ర కార్యాలయాన్ని పున: నిర్మాణం చేశారని, దీని వెనుక అనేక మంది కార్యకర్తల కృషి వుందన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యాలయ నూతన ప్రారంభోత్సవం విశ్వకర్మ సేవా సమితి, భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో వేద పండితుల చేత హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హోసబళే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక రంగంలో బీఎంస్ ప్రథమ స్థానానికి చేరుకుందని, అయితే..ఇందుకు కార్యాలయం కారణం కాదని, కార్యాలయం లేకున్నా.. ఆ స్థాయికి చేరుకున్నామని అన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమే పనిచేస్తున్నారని, వారి మనసంతా వీటిపైనే లగ్నమై వుంటుందన్నారు. అందులో కూడా మొదట బీఎంఎస్ సంఘటనా కార్యం గురించి, శ్రామికుల గురించి ఆలోచించిన తర్వాతే, వారి వ్యక్తిగతం గురించి తర్వాత ఆలోచిస్తారని ప్రశంసించారు. ఇదేమీ బీఎంఎస్ నినాదం కాదని, ఇదో జీవన శైలి అని, ఇది బీఎంస్ దృష్టికోణమని వివరించారు.
త్యాగం, తపస్సు, బలిదానమే బీఎంఎస్ కి చిహ్నమని, దీనిని స్థాపన నుంచే చెబుతూ వస్తున్నామని హోసబళే గుర్తు చేశారు. అయితే.. ఇదేమీ శబ్దాల ఉచ్చారణ కాదని, దీని వెనుక మహా కార్యం నడుస్తోందని, దీని కోసం చాలా మంది సర్వస్వాన్నీ అర్పణ చేసినవారున్నారని, అలాగే అహోరాత్రాలు సంఘటన కోసం, బీఎంఎస్ కోసం తపస్సు చేశారని, అంతకంటే ఓ అడుగు ముందుకు వేసి, అవసరం అనుకుంటే బలిదానం కూడా అయ్యారన్నారు. బలిదానం కోసం ఎన్నడూ వెనకడగే వేయలేదన్నారు. ఈ గుణాలన్నింటికీ సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా బీఎంఎస్ లో వున్నాయని తెలిపారు.
dattaji2
వీటన్నింటి గుణగణాల వల్లే 70 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా బీఎంఎస్ బృహత్ సంఘటనా శక్తిగా నిలబడిందని, అత్యంత పెద్ద శక్తిగా రూపాంతరం చెందిందని తెలిపారు. అయితే ఇదంతా కూడా కేవలం కార్యాలయ భవనం వల్లే కాలేదని, త్యాగం, తపస్సు, దృష్టికోణం, పరిశ్రమ వల్ల, దేశం కోసం పనిచేయాలన్న దృష్టి కోణంతోనే ఇంత పెద్ద పని జరిగిందని స్పష్టం చేశారు. ఇలాంటి సైద్ధాంతిక భూమిక వల్ల, పరిశ్రమ వల్లే బీఎంఎస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలబడిందని, ఈ కారణాల వల్లే అందరూ బీఎంఎస్ చెప్పినట్లు వింటున్నారని తెలిపారు.
శ్రామికుల సంఘటన, వారి ఆర్థిక పరిస్థితుల్లో అభ్యున్నతి, దేశహితం, పర్యావరణ సంరక్షణ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, భారతీయ మూలాల ఆధారంగా బీఎంఎస్ సమాజం ముందు వుంచిందని, దీని కోసమే సంఘటనను నిర్మించిందని, అలాగే కార్యకర్తలకు ప్రశిక్షణను కూడా ఇచ్చిందని, వీటి ఆధారంగా ఉద్యమాలు కూడా చేసిందని, అలాగే ఈ సైద్ధాంతిక భూమికపై కలిసొచ్చే వారితో ఓ జాబితా కూడా రూపొందించిందని, ఈ కారణాల వల్ల కూడా ప్రపంచంలో బీఎంఎస్ గురించి కార్మికులు, శ్రామికులు, సాధారణ ప్రజలు వినడానికి ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారని వివరించారు. అలాగే బీఎంఎస్ ఉద్యమ రూపాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు కూడా వస్తున్నారని తెలిపారు.
బీఎంఎస్ వ్యవస్థాపకులు దత్తోపంథ్ ఠెంగ్డే చైనాలో పర్యటించి, అక్కడ రేడియోలో ప్రసంగించారని, అక్కడి కరుడుగట్టిన కమ్యూనిస్టులు కూడా మంత్ర ముగ్ధులయ్యారని, బీఎంఎస్ ఇంత పటిష్ఠంగా, వేగంగా ఎలా సంఘటనాత్మక రూపం తీసుకుందో చెప్పాలంటూ ఆశ్చర్యపడిపోయారని గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచ వేదికలపై బీఎంఎస్ సైద్ధాంతికతను, ఆలోచనలను చెబుతున్నారని అన్నారు.
శ్రామికుల వికాసం, దేశ వికాసం, ఈ ప్రపంచంతో సమతౌల్యం, సమన్వయం, అలాగే ప్రపంచంలోని వివిధ రంగాలను సమన్వయం చేయడం, సామరస్వపూర్వకంగా ఓ శ్రామిక కుటుంబాన్ని నిర్మించడం అనే కల్పన అత్యంత విశిష్టమైందని, ఇతరుకుల ఇది అసాధ్యమైందని, అలాంటి సైద్ధాంతిక భూమికను బీఎంఎస్ ప్రపంచానికి అందించిందన్నారు.
dattaji23
వీటన్నింటి నేపథ్యంతో బీఎంఎస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, కలిసి వస్తున్నారని అన్నారు. అలాగే బీఎంఎస్ ఎదిగిన విధానం మన దేశంలోని వ్యక్తులకు కూడా చాలా ఆశ్చర్యచకితులు అయిన వారూ వున్నారన్నారు. అలాగే బీఎంఎస్ ను ఠేంగ్డేజీ, వారి నుంచి స్ఫూర్తి పొందిన వారు, కార్యకర్తలు బీఎంఎస్ ధ్యేయాన్ని ప్రజల ముందు వుంచారన్నారు.
బీఎంఎస్ వ్యాపకత్వం ఏదైతే వుందో అది కేవలం ఇటుకలు, మట్టి, రాళ్లు, సిమెంటు భవనాల ద్వారా జరగలేదని, కార్యకర్తల మనస్సు, కుశాగ్ర బుద్ధి కారణంగా, మనుష్యుల ప్రయత్నం వల్ల, సైద్ధాంతికత వల్ల, సమాజంలో బీఎంఎస్ సంఘటనను ప్రేమించే వారి వల్ల జరిగిందన్నారు. ప్రేమ, త్యాగం, బలిదానం, సైద్ధాంతికతే బీఎంఎస్ పునాదులు అని అభివర్ణించారు. వీటి ఆధారంగా మజ్దూర్ సంఘ్ సంఘటన నిలబడిందన్నారు.
కానీ భౌతికంగా చూసుకుంటే ఓ కార్యాలయం అత్యంత ఆవశ్యకమని అన్నారు. కార్యాలయంలో వసతులు కూడా అవసరమేనని, పని విస్తరిస్తోందని, అందుకే డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థ, సభ్యత్వం కూడా కావాలని, అయితే.. మజ్దూర్ సంఘ్ లో ఆర్థిక దృష్టికోణం, స్వదేశీ, ఆత్మనిర్భరత లాంటి విషయాలపై కూడా ఆలోచించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. అలాగే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ప్రశిక్షణ ఇస్తూ వుండాలని సూచించారు.
dattaji234
భారత ప్రభుత్వం తాజాగా కార్మికులకు సంబంధించి, కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చిందని, వీటిని కేవలం జాతీయ స్థాయి కార్యకర్తలే అధ్యయనం చేయడం కాదని, కింది స్థాయి కార్యకర్తలు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందని, కేవలం శారీరిక శ్రమ చేస్తే సరిపోదన్నారు. ప్రతి స్థాయిలో కూడా అధ్యయనం చేసే కార్యకర్తలు కావాలని, ఆందోళనలు, సంపర్కం చేసే కార్యకర్తలు కూడా కావాలని దత్తాత్రేయ హోసబళే పిలుపునిచ్చారు. బీఎంఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని, కొత్త కొత్త కార్యాలయాల నిర్మాణం జరుగుతుందన్న భావన ఒక్కటే కాదని, బీఎంఎస్ కార్యం కూడా విస్తరించాలని, దీని ద్వారా కార్యకర్త నిబద్ధత, సమర్పణా భావం, కార్యం కూడా అంత విస్తరించాలని హోసబళే సూచించారు.  కార్యాలయాన్ని నాలుగు అంతస్థులు కట్టి, సిద్ధాంతాన్ని మాత్రం పదంతస్థుల స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యాలయ ప్రారంభోత్సవంతో ఆనందం, స్వాభిమానం : భాగయ్య 
భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన ప్రాంత కార్యాలయం నిర్మాణం వల్ల ఆనందంతో పాటు స్వాభిమానం కలుగుతోందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య అన్నారు. ఓ వ్యక్తి జీవితంలో ఇల్లు కట్టుకోగానే ఆనందంతో పాటు ఓ స్థానం ఏర్పడుతుందని, అలాగే సంస్థ జీవితంలో కూడా కార్యాలయం కట్టుకున్న తర్వాత ఓ స్థానం ఏర్పడుతుందని, బీఎంఎస్ కి కూడా ఇదే తరహా స్థానం ఏర్పడిందన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెట్టి కార్యాలయాన్ని కట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
bhagayya ji
మజ్దూర్ సంఘ్ ప్రారంభం నుంచి కూడా రాజ్యశక్తి, ప్రభుత్వం ఆధారంగా సంస్థ మనుగడ కోసం ధనాన్ని సేకరించడం కాదని, కేవలం శ్రామికులు, కార్మికులు తమ రక్తాన్ని చెమటోడ్చి సంపాదించిన డబ్బుతోనే సంస్థ నడవాలన్న సంప్రదాయం వుందని, ఇప్పటికీ అదే సంప్రదాయంలో కొనసాగుతున్నామని తెలిపారు. మనకు సుఖం వుండాలని కానీ.. సుఖ లాలసత మాత్రం వుండొద్దని సూచించారు. ఎవరైతే సుఖలాలసతకు లొంగిపోతారో వారు రాజకీయాలకు, అహంకారానికి లొంగిపోతారన్నారు. బీఎంఎస్ కుటుంబం, కార్యకర్తలు అత్యంత సుఖంగా జీవించాలని, అయితే ఒక్క పైసా కూడా వృథా చేయవద్దని కోరారు. అయితే పిసినారులు మాత్రం కామని, అనవసర ఖర్చులు మాత్రం చేయవద్దన్నారు. సంఘటితంగా వున్న వారు అసంఘటిత కార్మికుల కోసం సమయం వెచ్చించాలని ఈ సందర్భంగా భాగయ్య పిలుపునిచ్చారు.
bhagayya ji2
ఇక.. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ మాట్లాడుతూ బీఎంఎస్ 70 సంవత్సరాలను పూర్తి చేసుకొని, 71 పడిలోకి అడుగు పెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. 86 లో ప్రారంభమైన ఈ కార్యాలయం నేడు భవ్యంగా మారిందని, ఇందులో వేలాది కార్యకర్తల శ్రమ వుందన్నారు. ఇది ఇప్పుడు కళ్లకు కట్టినట్లుగా ద్యోతకమవుతోందన్నారు. ప్రపంచంలోనే బీఎంఎస్ అనేది పెద్దదైన, బృహత్తరమైన సంస్థ అని అన్నారు. సంస్థ రెండు సార్లూ ప్రథమ స్థానంలోకి వచ్చిందని, ఇందులో తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా వుందని గుర్తు చేశారు.1989, 2002 లో అత్యధిక సభ్యత్వాలు చేసిన రాష్ట్రం తెలుగు రాష్ట్రమని గుర్తు చేశారు.బీఎంఎస్ అనేది అత్యంత పెద్ద ట్రేడ్ యూనియన్ అని, ఇందులో 5,836 యూనియన్లు బీఎంఎస్ తో కలిసి నడుస్తున్నాయన్నారు.
బీఎంఎస్ కి సంబంధించిన తెలంగాణ ప్రాంత కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా వుందని బీఎంఎస్ జాతీయ అధ్యక్షులు హిరణ్మయి పాండ్య అన్నారు. ఇందు కోసం చాలా మంది కార్యకర్తలు చెమటోడ్చారన్నారు. ఈ నూతన కార్యాలయం కార్యకర్తలందరికీ ప్రేరణాదాయకమని అభివర్ణించారు. నూతన కార్యాలయం ప్రారంభం అవడంతో కార్యకర్తల బాధ్యత కూడా పెరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *