ఢిల్లీలో భారీ పేలుడు.. 11 మంది మృతి, అనుమానితుడ్ని అదుపులోకి..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నారు.
మరో వైపు ఈ పేలుడు సంభవించడంతో పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్ టీమ్, ఎన్ఐఏ ఘటనా స్థలికి చేరుకున్నాయి. అయితే.. పేలుడు పదార్థాలలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.అంతేకాకుండా పేలుడు ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉగ్రవాదుల హస్తం ఏమైనా వుందా? అన్న దానిపై కూడా వేగంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.భారీ పేలుడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల వున్న కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరు కార్లు, రెండు ఇ రిక్షాలు, ఓ ఆటో రిక్షా మంటల్లో కాలిబూడిదయ్యాయి.
దాదాపుగా భారత భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగానే వున్నాయి. ఎప్పటికప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదులను గుర్తిస్తూ, వారి వ్యూహాలను తుత్తునీయలు చేస్తూనే వున్నారు. అయినా సరే ఢిల్లీలో తాజా పేలుళ్లు విచారించదగ్గ అంశమే. తాజాగా సోమవారం ఉదయమే ఢిల్లీ, హర్యానా పోలీసులు భారీ ఇస్లామిక్ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. నిషేధిత జైషే మహ్మద్,అన్సార్ ఘజవత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధమున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు కూడా. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *