హిజాబ్ నిషేధం విషయంలో మేము కల్పించుకోలేము : ముంబై హైకోర్టు
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ కాలేజీ యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. హిజాబ్ పై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబై హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్, రాజేష్ పాటిల్ డివిజన్ బెంచ్ తొమ్మిది మంది విద్యార్థినుల పిటిషన్‌ను కొట్టి వేసింది. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని, కేవలం యూనిఫాం వేసుకొని, విద్యార్థులందరూ క్రమశిక్షణతో వుండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు నివేదించింది.
చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ముంబైలో నిర్వహిస్తున్న ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ యాజమాన్యం ఆదేశాల్చింది. నిఖాబ్, బురఖా, బ్యాడ్జ్‌లు, లాంటి మతపరమైన వాటిని కాలేజీ లోపలికి అనుమతించమని యాజమాన్యం తేల్చి చెప్పింది. యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడంతో తమ మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కు, గోప్యత హక్కు, ఎంపిక చేసుకునే హక్కుకు విరుద్ధంగా వున్నాయని పిటిషన్ దాఖలైంది. దీంతో ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం కాలేజీ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.