పెన్షన్‌ డబ్బుతో పుస్తకాలు

ఏ ప్రభుత్వమైనా మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. వీటి ద్వారా వచ్చే డబ్బులతో మహిళలు తమ అవసరాలు తీర్చుకోవడమో, లేదా పిల్లల చదువులకో వినియోగిస్తుంటారు. ఎక్కువమంది తమ అవసరాల కోసమే వాడుకుంటారు. కర్నాటకలోని బెళగావి మహిళ మాత్రం వినూత్నంగా ఆలోచించి ‘‘పరోపకారార్థ మిదం శరీరం’’ అన్న సూక్తిని అక్షరాలా పాటించింది. కర్నాటకలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెలా 2 వేల రూపాయలను మహిళల ఖాతాలో జమ చేస్తోంది. అయితే బెళగావి జిల్లా రాయబాగ తాలూకా మంటూరు గ్రామానికి చెందిన మల్లవ్వ భీమప్ప అనే మహిళ మాత్రం ప్రభుత్వం ఇస్తున్న గృహలక్ష్మి సొమ్ముతో ఊళ్లో ఓ గ్రంథాల యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అక్కడి యువత భవిష్యత్తునే పూర్తిగా మార్చేస్తోంది. గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఉంటూ ప్రభుత్వ పోటీ పరీక్షల తయారీకి ఉపయోగపడే చిన్న లైబ్రరీ నడుపపోతోందది. దీనికోసం గృహ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన పదమూడు విడతల సొమ్మును, పంచాయతీ సభ్యత్వ గౌరవ వేతనంతో పాటు  ఖర్చు చేస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తమ తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మల్లవ్వ భీమప్ప ఆకాంక్ష. అందుకే ఈ లైబ్రరీ ప్రారంభించింది.   తన 13 నెలల గృహలక్ష్మి పథకం చెల్లింపుల నుంచి 26 వేల రూపాయలతో లైబ్రరీని నిర్మించింది. ఈ లైబ్రరీలో సివిల్స్‌కి సంబంధించిన పుస్తకాలు, గ్రూప్‌`1కి సంబంధించిన పుస్తకాలున్నాయి. కన్నడ, ఇంగ్లీషు భాషలోనూ వున్నాయి. బెళగావి, హుబ్లీ, ధార్వాడ్‌ వంటి నగరాల్లో వుండే కోచింగ్‌ సెంటర్లకి గ్రామీణ విద్యార్థులు ఆర్థిక కారణాల రీత్యా వెళ్లడం లేదు. దీంతో వారి ఇబ్బందులను తెలుసుకొని, మల్లవ్వ ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కోచింగ్‌ సెంటర్లలో ఫీజులు కట్టడం, ఆ నగరాల్లోని హాస్టళ్లలో డబ్బులు కట్టడంలాంటి ఇబ్బందులు వున్నాయని, అందుకే గ్రామీణ విద్యార్థులకు సాయం చేయడానికే ఈ గ్రంథాలయం అని తెలిపారు. తనకు వచ్చిన ఆలోచనలను మొదట విద్యావంతులతో చర్చించారు. ఆ తర్వాత వారు కూడా ముందుకు రావడంతో సంకల్ప్‌ గ్రామ సేవా సంస్థ వారు ఈ గ్రంథాలయానికి పుస్తకాలను బహుమతిగా అందజేశారు. పల్లెల్లో చాలా మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువుకోవడంలేదని, చదువుకి దూరమవుతున్నారని మల్లవ్వ వాపోయారు. మరికొందరు చదువుకున్నా.. కోచింగ్‌ సెంటర్ల ఫీజులు భరించలేక.. పోటీ పరీక్షలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలన్న తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే ఈ గ్రంథాలయాన్ని స్థాపించానని పేర్కొన్నారు. మరోవైపు ఈ గ్రంథాలయాన్ని మల్లవ్వ అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులూ ఇందులో వున్నాయి. ఒకరు చదువుతున్నంతసేపూ పుస్తకం కోసం మరో విద్యార్థి వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. అనేక కాపీలు తెప్పించారు. దీంతో విద్యార్థుల సమయం వృథా కాదని మల్లవ్వ పేర్కొన్నారు. లైబ్రరీలో బుక్‌ కేబిన్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్‌, విద్యుత్‌ కోసం బ్యాటరీ బ్యాకప్‌, స్వచ్ఛమైన తాగునీరు, శ్రద్ధగా చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చారు.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ లైబ్రరీ తెరిచి వుంటుంది. ఇప్పటి వరకూ యువత బయట తిరిగేవారని, ఇప్పుడు యువత లైబ్రరీలో సమయం గడుపుతున్నారని మల్లవ్వ ఆనందం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *