ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఓ వరం : వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వ్యవసాయం మరియు గ్రామీణ రంగాలకు ఓ వరం అంటూ అభివర్ణించారు. ఇది బలమైన మరియు స్వావలంబన భారత్‌కి మార్గం సుగుమం చేస్తుందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలబడేందుకు బడ్జెట్ ఓ రోడ్‌మ్యాప్ అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలను కూడా ఇది దోహదం అవుతుందని నొక్కి చెప్పారు. అలాగే వ్యవసాయదారులకు, మహిళలకు, యువతకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఓ విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి పార్లమెంట్‌లో తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత భారత్‌ను దృష్టిలో వుంచుకని ప్రవేశపెట్టిన 2024`25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా కేంద్రం కేటాయింపులు చేసింది. మొత్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే రెండు సంవత్సరాలలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని, ఆ దిశగానే తమ కార్యక్రమాలు వుంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.