గంగా నదిని పరిశుభ్రం చేస్తూ… నది ప్రాముఖ్యాన్ని వివరిస్తున్న ఉపాధ్యాయ
దేశంలోనే అతి పవిత్రమైంది గంగానది. దానిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నమామి గంగే పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రక్షాళన పనులు చేస్తోంది. నది ప్రక్షాళన, డ్రెయిన్ల ట్యాపింగ్, మురుగునీటి ప్లాంట్ల నిర్మాణం వంటివి జరుగుతున్నాయి. అయితే… ఇవి ఓ వైపు సాగుతుండగానే.. తనవంతు కృషిగా బ్రిజ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి బెంగాల్ లోని గంగను శుభ్రపరిచే బాధ్యతను తమ భుజ స్కంధాలపై వేసుకున్నారు. 2009 నుంచి గంగా నదిని శుభ్రపరిచే పనిలో వున్నారు. గంగా నది ప్రాముఖ్యాన్ని ప్రజలకు వివరిస్తూ… శుభ్రతపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. గంగా సమగ్ర అభియాన్ యొక్క దక్షిణ బెంగాల్ ప్రావిన్స్ కోఆర్డినేటర్ బ్రిజ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, తాను 2009 నుండి గంగా నదిని శుభ్రపరిచే పనిలో ఉన్నానని చెప్పారు.
సమాజం నుంచి వ్యక్తులను, అలాగే పాఠశాలల నుంచి విద్యార్థులను… ఇలా లక్ష మందితో గంగా పరిశుభ్ర ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం గంగా పరిశుభ్రతే కాకుండా దాని పవిత్రతను చాటి చెప్పడానికి, పూజ్య భావాన్ని మరింత పెంచడానికి గంగా ఆరతి, దేవ్ దీపావళి, గంగా దసరా వంటి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తాజాగా బెంగాల్ లో ‘‘గంగా ఉత్సవ్’’ ను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం గంగా మహోత్సవ్ ను ప్రారంభించిందన్నారు. ఇప్పటికే బెంగాల్ లో అమలులో వున్నా… తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. అలాగే పాఠశాలలను సంప్రదించి, గంగానది పరిశుభ్రతపై చిన్నారులకు కూడా అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన వస్తోందన్నారు.
దీంతో పాటు నీటి సంరక్షణ గురించి కూడా బ్రిజ్ ఉపాధ్యాయ్ అవగాహన పెంచుతున్నారు. దీని కోసం ఫ్లాట్లను కూడా సందర్శిస్తుంటారు. వారికి నీటిపై అవగాహన కల్పిస్తున్నారు. నీటిని ఒడిసి పట్టే కార్యక్రమాలను వివరిస్తుంటారు. ఇది చేస్తూనే గంగానది ప్రక్షాళనపై కూడా పనిచేస్తుంటారు. ఇది నిరంతర కృషి అని వివరించారు.
గంగా ఉత్సవ్ 2024 కార్యక్రమాన్ని హరిద్వార్ లోని చండీ ఘాట్ లో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. నదిని పరిరక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే గంగానది సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పడం కూడా. మరియు పరిశుభ్రత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.