హాదీ హంతకులు భారత్ లోకి రాలేదు : బీఎస్ఎఫ్ కీలక ప్రకటన
బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా వున్న ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ భారత్ కు పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు స్పందించాయి. బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ప్రకటనను బీఎస్ఎఫ్ దళాలు, మేఘాలయ పోలీసులు ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎవరూ వచ్చినట్లు ఆధారాలు లేవని ప్రకటించింది. సరిహద్దుల్లో తమ బలగాలు నిరంతరం అప్రమత్తంగా వున్నాయని తెలిపింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పొరుగు దేశం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని బీఎస్ఎఫ్ మండిపడింది. బంగ్లాదేశ్ పోలీసులు, బంగ్లాదేశ్ మీడియా చేసిన ప్రకటనల్లో ఏ మాత్రం నిజంలేదని మేఘాలయ పోలీసులు కూడా ప్రకటించారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, తాము ఎవ్వర్నీ అరెస్ట్ చేయలేదని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ భారత్ పై చేస్తున్న తప్పుడు ఆరోపణలేనని మండిపడింది.