“కనెక్టింగ్ భారత్’’ అంటూ బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో…
ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ కొత్త లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. గతంలో కనెక్టింగ్ ఇండియా అని వుండేది. ఇప్పుడు కనెక్టింగ్ భారత్ అని రాసుకుంది. ఇక… గతంలో లోగో రెడ్, బ్లూ, యాష్ కలర్లో వుండేది. తాజాగా లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్ కలర్స్ తో లోగో రూపొందించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం భారత్ సంచార్ భవన్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.తమ సంస్థ ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగానే కొత్త లోగోను రూపొందించామని అధికారులు తెలిపారు. ఇది కేవలం లోగో మాత్రమే కాదని, తమ సంస్థ దృష్టికోణాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. లోగోలో ఆకుపచ్చ మరియు తెలుపు బాణాలు తమ సంస్థ సమగ్ర దేశవ్యాప్త ఉనికిని నొక్కి చెబుతున్నాయని, మారుమూల ప్రాంతాలకి కూడా సేవలందిస్తామన్న సంకేతాలిస్తోందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ నూతన లోగో బీఎస్ఎన్ఎల్ తదుపరి లక్ష్యాలు, రాబోయే దశలను సూచిస్తోందని తెలిపారు. భారత్ కి సాంకేతికతను అందించడంలో సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు.కనెక్టింగ్ ఇండియా నుంచి కనెక్టింగ్ భారత్ అని రాశారని, అన్ని వర్గాల వారికి అందుబాటులో వుంటుందన్న అర్థం వస్తుందని, అందరికీ కనెక్ట్ అవుతుందన్న అర్థం వస్తుందని, ఇందులో ఆర్థిక, సామాజిక భేదాలుండవి వివరించారు.
ఇక.. లోగో మార్పుతో పాటు ఏడు కొత్త సర్వీసులను కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది.
1. స్పామ్ రహిత నెట్ వర్క్ : అవాంఛిత కాల్స్, మెసేజ్ ల నుంచి రక్షిస్తుంది. క్లీన్ కమ్యూనికేషన్ ను అందిస్తుంది.
2. వైఫై నేషనల్ రోమింగ్ : వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి ఆలోచించకుండా దేశ వ్యాప్తంగా వైఫై యాక్సెస్ ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ లో వుండడానికి ఇది సహకరిస్తుంది.
3. బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ : ఫైబర్ టు ది హోమ్ కనెక్షన్లతో వినియోగదారుల కోసం 500 ప్రీమింయ ఛానెల్స్ కి యాక్సెస్ ను ఇస్తుంది. దీంతో యూజర్ కి ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది.
4. ఎనీ టైమ్ సిమ్ కియోస్క్ : ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డులు కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీని కోసం ప్రత్యేక కేంద్రాలను చేయనున్నారు.
5. డైరెక్ట్ టు డివైస్ సర్వీస్ : శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీని దీంతో పొందవచ్చు. ఎక్కడి నుంచైనా మెసేజ్ సేవలను పొందవచ్చు.
6. పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ లైఫ్ : అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ ను మెరగపరచడానికి ఇది ఉపకరిస్తుంది. అలాగే భద్రమైన నెట్ వర్క్ ను అందిస్తుంది.
7. గనులలో ప్రైవేట్ 5జీ : ఈ సర్వీసు ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేస్తుంది.