నాగపూర్ అల్లర్ల మాస్టర్ మైండ్ ఫహీమ్ ఖాన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
నాగపూర్ హింస వెనుక వున్న మాస్టర్ మైండ్ ఫహీమ్ ఖాన్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఫహీమ్ ఖాన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టంది. సోమవారం ఉదయం అతడి నివాసం, ఇత నిర్మాణాలను నాగపూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారు. నాగపూర్ లోని యశోధర నగర్ లోని సంజయ్ బాగ్ కాలనీలో ఫహీమ్ ఖాన్ ఇల్లు వుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ ఇల్లు అక్రమమని పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల కూల్చేశామని అధికారులు తేల్చిచెప్పారు.
అయితే.. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీ లాగా మహారాష్ట్రలో కూడా నాగపూర్ అల్లరి మూకల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్లు వుంటాయా? అని అడగ్గా… సమయం వచ్చినప్పుడు సరైన చర్యలు వుంటాయని ప్రకటించారు. ఈ ప్రకటన ఇచ్చి.. కొన్ని రోజుల తర్వాతే ముఖ్యమంత్రి కఠిన చర్యలకు ఉపక్రమించారు.
నాగపూర్ హింసాకాండ వెనుక వున్న ముఖ్య సూత్రధారి (మాస్టర్ మైండ్) ఫహీమ్ షమీమ్ ఖాన్ (38) ని కొద్ది రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనారిటీస్ డెమోక్రెటిక్ పార్టీ లో నాయకుడిగా వున్నాడు. ఈ నెల 17 న నాగపూర్ లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. గణేష్ పేట్ పోలీసు స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఫహీమ్ పేరును కూడా పోలీసులు చేర్చారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే అరెస్టయ్యాడు. అంతేకాకుండా ఫహీమ్ షమీమ్ ఖాన్ ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు.
దీంతో పాటు హింస చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియోను కూడా పోలీసులు సంపాదించారు.అల్లర్లకు ఫహీమ్ ఖాన్ కుట్ర పన్నాడని, దాదాపు 100 మందిని ఇందు కోసం సమీకరించాడని, చివరికి హింసకు దారి తీసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అలాగే గణేష్ పేట్ పోలీసుల ముందే రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో కూడా లభించినట్లు తెలుస్తోంది. అలాగే పుకార్లను వ్యాప్తి చేశాడని కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.