నిజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన బైరాన్‌పల్లి

హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర  – 7వ భాగం

నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్‌ స్టేట్‌ లోని  ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాడులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు. అలాంటి సంఘటనే నాటి నల్గొండ జిల్లాలోని భైరవునిపల్లెలో జరిగింది. ఈనాడు ఈ గ్రామం సిద్ధిపేట జిల్లాలో అంతర్భాగం. భైరవునిపల్లి ప్రజలు గ్రామ నివాసి శ్రీ ఇమ్మడి రాజిరెడ్డి  నాయ కత్వంలో రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభి మానాన్ని నిరూపించుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘రజాకార్లు మజాకర్లుగా తయారై యథేచ్ఛగా గ్రామాలను దోచుకునేవాళ్ళు. తగులబెట్టే వాళ్ళు చందాల పేరుతో డబ్బులు వసూలుచేసే వారు. ఇవ్వని గ్రామాలపై దాడిచేసి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు.

భైరవునిపల్లి గ్రామానికి 12 వందల రూపాయలు చందా ఇమ్మని తాఖీదు పంపారు రజాకార్లు. భైరవునిపల్లి గ్రామం చుట్టూ కోటగోడ ఉండేది. ఈ గోడకి ఎత్తయిన బురుజుండేది. సురక్షితంగా ఎత్తుగా ఉన్న ఈ బురుజు భైరవునిపల్లి గ్రామానికి ఎంతో మేలు చేసింది. ఇదే బురుజుపైన మందుగుండు సామాగ్రి వగైరా సేకరించి ఇరువది నాలుగు గంటలపాటు గ్రామస్తులలో ఇద్దరు తుపాకులు చేతబూని కాపలా కాస్తుండే వాళ్ళు.రజాకార్లు కనపడితే బురుజుపైనున్న నగారా మ్రోగించే వాళ్ళు. గ్రామస్థులు పనులు వదలి గ్రామరక్షణకు సిద్ధమయ్యేవారు.  చుట్టుప్రక్కల ఉన్న ఆరేడు గ్రామాలను కూడా ఇలాగే తయారుచేసి రక్షణ దళాలను ఏర్పరిచారు. యాభైమంది కర్రలతో, గొడ్డళ్ళతో సహా అన్ని గ్రామాల్లో తిరిగి ధైర్యం చెబుతుండే వారు. ఈ గ్రామాలలో వైర్‌లెస్‌ వార్తా హరుడిగా శ్రీ విశ్వనాథ భట్‌ జోషి సైకిలుపై తిరుగుతూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. గ్రామాల పరిస్థితిపై రైతులకు సమాచారంగా అందచేసేవాడు.

రేవర్తి గ్రామం నుండి రజాకార్లు బయలు దేరుతున్నారు. తుపాకులతో అన్నీ సిద్ధం చేసుకొని ఈ రజాకార్లు భైరవునిపల్లిపై దాడిచేయ యత్నించారు. వీళ్ళను చూడగానే నగారా మ్రోగిం చారు. బురుజుపైనుండి కాల్పులు ప్రారంభమై నాయి. రజాకార్లు తట్టుకోలేకపోయారు. పిక్కబలం చూపెట్టుతుండగా గ్రామస్థులు వెంటబడి తరిమారు. దండాల కృష్ణయ్య అనే వ్యక్తి గాయపడి కూడా రజాకార్ల నుండి తుపాకీ లాక్కోగలిగాడు. ఈ తర్వాత రజాకార్లు పోలీసు అమీన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈసారి అమీన్‌ స్వయంగా వచ్చి భైరవుని పల్లి తనిఖీ చేశాడు. బురుజుపై ఉన్న మందుగుండు సామాగ్రి వగైరా చూసి వారితో ఇలా అన్నాడు.. ‘‘మేముండగా మీకెందుకు ఈ ఏర్పాట్ల ఫికర్‌? కమ్యూనిస్టులను మేము ఎదు ర్కొంటున్నాం. మిమ్మల్ని రజాకార్లతో దోస్తీ చేయిస్తాం’’ అని చెప్పి గ్రామంలో తుపాకులను స్వాధీనం చేసుకున్నాడు. రాజిరెడ్డికి రేవర్తిలోని రజాకార్లకు రాజీ కుదిర్చాడు.

రజాకార్ల ఎదుర్కోవడానికి గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటు కొంతకాలం తర్వాత హైద్రాబాద్‌ రియసత్‌ ప్రధానమంత్రి అయిన లాయక్‌ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్‌ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుప గుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్‌, ధూళిమిట్ట, తోరసాల్‌, జాలపల్లి, కొండాపూర్‌, కుటిగల్‌, సోలిపూర్‌, అంకుశీపూర్‌ తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకు న్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీకరించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది. ఇక్బాల్‌ హాషం ఓటమిఈ డిప్యూటీ కలెక్టర్‌ శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపేశాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకు న్నాడు. బురుజు పైనుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది.

ఉదయం పదిగంటల నుండి సాయంత్రం వరకు రెండువైపుల నుండి కాల్పులు కొనసాగాయి. ఎంత ప్రయత్నించినా హాషిం తన ముఠాతో గ్రామంలో ప్రవేశించలేకపోయాడు. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ పోరాటంలో హాషిం ముఠా నలుగురు నిరాయుధులను మాత్రం చంపగలిగింది.తమ పక్షాన పదిహేను మందికి పైగా చనిపోయాకి, వాళ్ళను బళ్ళపై వేసుకొని తిరుగుముఖం పట్టక తప్పలేదు. తన ప్రయత్నం విఫలం కాగా హాషిం మరింత కసితో ఆ గ్రామాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విజయ వంతమైన తమ పోరాటం వల్ల భైరవునిపల్లి గ్రామస్థుల ధైర్యం మరింత పెరిగింది. రజాకార్ల ముఠాలను నిర్భయంగా ఎదుర్కొనగలమనే ధీమా హెచ్చింది. నిజాం సైన్యం ముందు తాము నిలువ గలమా? అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించ లేదు. సైన్యం వచ్చి చుట్టుముట్టనున్నదనే వార్త తెలిసినా గ్రామం ఖాళీచేసి అడవుల్లోకి పారిపో వాలనే ఆలోచనే వాళ్ళకు తట్టలేదు. తత్ఫలితంగా భైరవునిపల్లి సర్వనాశనం కాక తప్పలేదు.

హైద్రాబాద్‌ వరంగల్‌ మార్గంలో ఉన్న జనగామ తాలూకా కేంద్రంలో నిజాం ప్రభుత్వం తాత్కాలికంగా మిలిటరీ క్యాంపు ఏర్పాటు చేసింది. నిజాం సైన్యంలో ఒక మేజర్‌, ఇద్దరు కెప్టెన్‌లు తమ దళాలతో సహా వచ్చి విడిది చేశారు. మరోవైపు నుండి సాయుధపోలీసు దళం వచ్చింది. వరంగల్‌, నల్లగొండ డి.యస్‌.పి.లు, వరంగల్‌కు చెందిన డి.జి.లు స్వయంగా వచ్చి ఏర్పాట్లు చూశారు. రజాకార్ల ముఠా తమ నాయకులతో సిద్ధంగా ఉంది. వరంగల్‌, మెదక్‌ సుబేదారులు (కమీషనర్‌లు) ఇక్బాల్‌ హాషిం, తమ బలగాలతో వచ్చి కలుసు కున్నారు. ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న సైనిక ఏర్పాట్లను చూసి జనగామ ప్రజలు భీతావహులై పోయారు. రోజు రోజుకూ పెరుగుతున్న రజాకార్ల అత్యాచారాలు, నిజాం ప్రభుత్వ దమనకాండ ప్రజలను నిస్సహాయుల్ని చేశాయి. ఏదో పెద్ద హత్యాకాండకు పన్నాగం పన్నుతున్నారనే విషయం స్పష్టమైంది. ఆ రాత్రి ట్రక్కుపై సామాన్లు వేసుకొని 500 మంది సైనికులు, పోలీసులు, రజాకార్లు జనగామ నుండి సిద్ధిపేటవైపు వెళ్ళే రోడ్డుమీదుగా బయలుదేరారు. వెంట 200 మందికి పైగా హిందూ, ముస్లిం సివిల్‌ అధికారులు కూడా ఉన్నారు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *