నిజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన బైరాన్‌పల్లి
నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు.
అలాంటి సంఘటనే నాటి నల్గొండ జిల్లాలోని భైరవునిపల్లెలో జరిగింది. 1948 ఆగస్ట్, 27న ఈ గ్రామం సిద్ధిపేట జిల్లాలోని భైరవునిపల్లి ప్రజలు గ్రామ నివాసి శ్రీ ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వంలో రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘రజాకార్లు మజాకర్లుగా తయారై యథేచ్ఛగా గ్రామాలను దోచుకునేవాళ్ళు. తగులబెట్టేవాళ్ళు చందాల పేరుతో డబ్బులు వసూలుచేసేవారు.ఇవ్వని గ్రామాలపై దాడిచేసి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు.
భైరవునిపల్లి గ్రామానికి 12 వందల రూపాయలు చందా ఇమ్మని తాఖీదు పంపారు రజాకార్లు. ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుపగుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్, ధూళిమిట్ట, తోరసాల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలిపూర్, అంకుశీపూర్ తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీక రించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది. ఇక్బాల్ హాషం ఓటమిఈ డిప్యూటీ కలెక్టర్ శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపే శాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకున్నాడు. బురుజు పైనుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది.
అమానుషమైన నరసంహారం
ఆగస్ట్ 27న గ్రామాన్ని అరమైలు పరిధిలో సైన్యం చుట్టుముట్టింది. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఈ భారీ ఎత్తున ఉన్న బలం భైరవుని పల్లి మీద దాడికి సిద్ధంగా ఉంది. సైన్యం చుట్టు ముట్టిన వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఎదురుదాడికి ప్రయత్నించారు. చిన్న ఫిరంగి కాల్పులు ప్రారంభమయ్యాయి. అయితే చుట్టుముట్టిన సైనిక బలగం దగ్గర పెద్ద ఫిరంగి ఉంది. ఇటునుండి వరుసగా పదమూడు గుళ్ళను సైనికులు పేల్చారు. ఈ ప్రేలుడు చప్పుడు చుట్టుప్రక్కల గ్రామాలకు వినబడింది. గ్రామంలో అనేక ప్రాంతాలలో నిప్పు అంటుకుంది. కొన్ని ఇళ్ళు కూలిపోయాయి.
ముఖ్యమైన రక్షణ సామగ్రి ధ్వంసం
అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజుపైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండగానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది వగైరా అంతా కూలి ముఖ్యమైన రక్షణ సామాగ్రి ధ్వంసమైపోయింది. గ్రామస్థులు ఇది రజాకార్ల దాడి కాదనే విషయాన్ని గ్రహించారు.ప్రతిఘటించి ప్రయోజనం లేదని బురుజు పైనుండి తెల్లజెండా చూపారు. అయినా నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు జరుపుతూనే వచ్చింది. గ్రామంలో చొచ్చుకొని వస్తున్న సైనికులు అడవి జంతువులలాగా ప్రవర్తించారు. కనబడిన ప్రతి అమాయకుణ్ణి కాల్చివేశారు. ఒకమూల నిలబడి సైనికులు పదిమంది యువకులపైకి చేతిబాంబులువేసి చంపివేశారు. ఊరు అవతలికి 92 మంది యువకులను పట్టి తెచ్చి నిలబెట్టారు. వాళ్ళలో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు ముసలివాళ్ళను వదలి దాదాపు అందరినీ స్టెన్‌గన్‌తో కాల్చి హత్య చేశారు. ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారియైన ఖాసిం రజ్వీ ముఖ్య అనుచరుడైన మొహజ్జిం హుస్సేన్ (నల్గొండ) అత్యధికమైన భాగాన్ని పంచుకున్నాడు. తర్వాత గ్రామంలో హరిజనులను పిలిచి 90 మంది శవాలను నిరుపయోగంగా ఉన్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు.
నిర్దోషులైన వేలాదిమంది ప్రజల రక్త ప్రవాహం నిజాం రాజ్యాన్ని కూలదోసింది. ప్రజల రక్తం నిజాం నిరంకుశాధికారాన్ని శాశ్వతంగా ఎలా సమాధిచేసి వేసిందో చరిత్రే నిరూపించింది.
సూచన:
నిజాం వ్యతిరేక పోరాటంలోనేకాక దేశ స్వాతంత్య్ర పోరులో కూడా తెలంగాణకు చెందిన అనేకమంది పాల్గొన్నారు. స్వాతంత్య్రపు అమృతోత్సవాల (75సంవత్సరాలు) సందర్భంగా ఆ అమరవీరులను గుర్తుచేసుకోవడం,నివాళులు అర్పించడం మన బాధ్యత. జిల్లా, మండలం, గ్రామాల్లో ఇటువంటి వీరులకు, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వివరాలు ఉంటే సేకరించి పంపండి. అవి లోకహితంలో ప్రచురిత మవుతాయి. మన ప్రాంతంలో జరిగిన సంఘ టనలు, వ్యక్తుల గురించి ఇతరులు కూడా తెలుసుకుని స్ఫూర్తిని పొందగలుగుతారు. వ్యాసాలను క్లుప్తంగా, సూటిగా వ్రాస్తే బాగుం టుంది. వ్యాసాలు పంపవలసిన ఇ మెయిల్ : lokahitham@gmail.com