ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం

భారత 17 వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించారు. విజయానికి 377 ఓట్లు కావాల్సి వుండగా.. రాధా కృష్ణన్ కి 452 ఓట్లు పోలయ్యాయి. ఇక.. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. 14 మంది ఎంపీలు గైర్హాజర్ అవ్వగా.. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు రాజ్యసభ సెక్రెటరీ ప్రకటించారు.
తొలి ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ..
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌజ్ లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 10 గంటల సమయంలో తొలి ఓటు వేశారు. అనంతరం మిగతా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 781 మందిలో మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్ సభ, రాజ్యసభ తో సహా మొత్తం 788 మంది ఎంపీలు వుండాలి. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా వున్నాయి. అయితే మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి వుంటుంది. వారిలో 13 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. వీరిలో బీఆర్ఎస్ నుంచి నలుగురు, బీజేడీ నుంచి 7 మంది, శిరోమణి అకాళీదల్ నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఓటు వేయలేదు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు..
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధా కృష్ణన్ కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.”మన రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే మరియు పార్లమెంటరీ చర్చను పెంపొందించే” అత్యుత్తమ నాయకుడు అవుతారని తాను విశ్వసిస్తున్నాను. తన జీవితాన్ని సమాజానికి సేవ చేయడానికి, పేదల సాధికారతకు అంకితం చేశారు. వారికి అభినందనలు తెలుపుతున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా రాధాకృష్ణన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

1957, అక్టోబర్ 20 న తమిళనాడులోని తిరుప్పుర్ లో పొన్నుస్వామి – జానకీ దంపతులకు రాధాకృష్ణన్ జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. 16 ఏళ్ల వయస్సులోనే ఆరెస్సెస్ లో చేరారు. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ లో కూడా పనిచేశారు. దాని తర్వాత బీజేపీ స్థాపన జరగడంతో అందులో చేరారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీచేసి, 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. మళ్లీ 1999 లో జరిగిన ఎన్నికల్లోనూ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఈయన సేవలు, సమర్ధతను గుర్తించిన ప్రధాని మోదీ 2023 లో జార్ఖండ్ గవర్నర్ గా నియమించింది. ఆ తర్వాత తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.జూలై మాసంలో మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్ గా బాధ్యతలు అప్పజెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *