సీఏఏ – డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌

– బల్బీర్‌ పుంజ్‌

పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారత దేశానికి రావాలని డాక్టర్‌ అంబేద్కర్‌ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్‌ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.

దళితులందరూ భారతదేశానికి తిరిగిరావాలని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎందుకు కోరుకున్నారు?

పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీల ప్రస్తుత పరిస్థితి దేశవిభజన సమయంలో జరిగిన తప్పుల ప్రత్యక్ష ఫలితం, సహజ పరిణామ క్రమం. నాటి చారిత్రాత్మక తప్పిదాలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించేందుకు సీఏఏ ప్రయత్నిస్తున్నది. మన భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లో హిందూ మైనారిటీల ప్రస్తుత దుస్థితిని ఆనాడే ఊహించారు. అందుకే ఆయన రెండు దేశాల మధ్యా ‘జనాభా బదిలీ’ కోసం బలంగా పట్టుబట్టారు. పాకిస్తాన్‌లో చిక్కుకున్న దళితులందరూ ‘తమకు దొరికిన మార్గాల ద్వారా’ భారతదేశానికి రావాలని ఆయన కోరుకున్నారు. ‘ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం’ షెడ్యూల్డ్‌ కులాలకు ప్రాణాంతకమని డాక్టర్‌ అంబేద్కర్‌ స్పష్టంచేశారు. పాకిస్తాన్‌, హైదరాబాదులోని దళితులు   కొందరు హిందువులపై అయిష్టత కారణంగా ముస్లింల పక్షాన ఉండరాదని పలుమార్లు హెచ్చరించారు.

‘‘పాకిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్న షెడ్యూల్డ్‌ కులాల వారు.. తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే అటు పాకిస్తాన్‌లో గాని, ఇటు హైదరాబాదులో గాని, ముస్లింలు లేదా ముస్లిం లీగ్‌పై విశ్వాసం ఉంచడం’ షెడ్యూల్డ్‌ కులాలకు ప్రాణాంతకం. అగ్రవర్ణ హిందువుల పట్ల అయిష్టత కారణంగా ముస్లింలను తమ మిత్రులుగా చూడటం షెడ్యూల్డ్‌ కులాలవారికి అలవాటుగా మారింది. ఇది తప్పుడు అభిప్రాయం’’ అని డాక్టర్‌ అంబేద్కర్‌ అన్నారు. (ది ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌, నవంబర్‌ 28, 1947 నాటి సంచికలో ‘‘డాక్టర్‌ అంబేద్కర్‌: లైఫ్‌ అండ్‌ మిషన్‌’’ పేరిట ధనంజయ్‌ కీర్‌ రచించిన వ్యాసం, పేజీ. 399)

 ఒక ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లో ముస్లిమేతరులు జీవించడం అసాధ్యమన్నది డాక్టర్‌ అంబేద్కర్‌ నమ్మకం. ‘‘ఇస్లాం అనేది ఒక గోప్యమైన పౌర వ్యవస్థ. అక్కడ ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య చూపే వ్యత్యాసం చాలా స్పష్టంగా, నిశ్చయాత్మ కంగా, చాలాదూరంలో నిలిపేంతటి వివక్షతో కూడినది. ఇస్లాంలోని సోదరభావం అనేది మానవు లందరి మధ్యా ఆశించే సార్వత్రిక సోదరభావం కానే కాదు. అది ‘‘ముస్లింల కోసం మాత్రమే ముస్లింలు..’’ అనే సోదరభావం. దీని ప్రయోజనం ఆ గోప్యమైన పౌర వ్యవస్థలోని వారికి మాత్రమే పరిమితం. ఈ వ్యవస్థకు బయటనున్నవారికి దక్కేవి ధిక్కారం, శత్రుత్వం మాత్రమే..’’ అని ‘‘పాకిస్తాన్‌ ఆర్‌ పార్టిషన్‌ ఆఫ్‌ ఇండియా’’ అనే తమ విశిష్ట రచనలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వ్రాశారు.

ఇస్లాం మత సూత్రాలననుసరించి రూపొందించిన ముస్లిం చట్టం ప్రకారం ప్రపంచం రెండు శిబిరాలుగా ఉంటుంది. దారుల్‌-ఇస్లాం (ఇస్లామిక్‌ రాజ్యం), దారుల్‌-హరబ్‌ (ఇస్లామిక్‌ పాలన లేని యుద్ధ భూమి). ఇస్లాం పాలన ఉన్న దేశం దారుల్‌ ఇస్లాం అయితే, ముస్లింలు ఉన్నప్పటికీ వారి పాలన లేని దేశం దారుల్‌ హరబ్‌. ఇస్లామిక్‌ మత సూత్రాల ప్రాతిపదికన రూపొందిన ముస్లిం చట్టం ప్రకారం భారతదేశం హిందువులు, ముస్లింలకు ఉమ్మడి మాతృభూమి కాజాలదు, అంతేగాక హిందూ ముస్లింలు సమానులుగా జీవించగలిగే భూమి కూడా కానేరదు. ముస్లింల పాలనలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ముస్లింల భూమి అవుతుంది. ఈ భూమి ముస్లిమేతరుల అధికారంలో ఉన్నప్పుడు, అది ముస్లింల భూమి కాజాలదు. అంటే, ఆ భూమి దారుల్‌-ఇస్లాం అవ్వడానికి బదులు, దారుల్‌-హరబ్‌ అవుతుంది’’ అని డాక్టర్‌ అంబేద్కర్‌ వివరించారు.

ఇక జనాభా మార్పిడి కోసం డాక్టర్‌ అంబేద్కర్‌ తమ వాదనకు మద్దతుగా ఇలా వివరించారు, ‘‘ముస్లింల దృష్టిలో హిందువులు (ముస్లిమేతరులు ఎవరైనా) అంటే కాఫిర్లు. ఈ కాఫిర్లు (ఇస్లాం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు) గౌరవానికి అర్హులు కారు. ఆ వ్యక్తులది ఒక హోదా అంటూ లేని తక్కువ స్థాయి జన్మ.

అందుకే కాఫిర్ల (ముస్లిమేతరులు) పాలనలో ఉన్న ఏ దేశమైనప్పటికీ అది ముస్లింలు ఎలాగైనా జయించి తీరవలసిన దారుల్‌-హరబ్‌ (ఇస్లామిక్‌ పాలన లేని యుద్ధభూమి). దీనిని దారుల్‌-ఇస్లాం (ముస్లింల భూమి)గా మార్చాలి. ఈ ప్రకారం.. ముస్లింలు హిందువుల మాటను ఎంత మాత్రం ఖాతరు చెయ్యరని రుజువు చెయ్యడానికి మరే విధమైన సాక్ష్యమూ అవసరం లేదని దీనిని బట్టి అర్థమవుతోంది.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *