ఆధార్ లాగే ప్రతి రైతుకీ ఇక ఓ కార్డు… 14 వేల కోట్లతో ఏడు కొత్త పథకాలకు కేంద్రం శ్రీకారం
దేశంలో వ్యవసాయ రంగానికి మరింత ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. 14 వేల కోట్ల రూపాయలతో ఏడు నూతన సాగు పథకాలను కేంద్రం ప్రకటించింది. దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికే ఈ లక్ష్యాలను ప్రకటిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకాలు సాగులో మరిన్ని పరిశోధనలతో పాటు సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ వాటికి దోహదపడతాయని కేంద్రం తెలిపింది.
1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ – 2,817 కోట్లు
2. ఆహార పౌష్టిక భద్రత – 3,979 కోట్లు
3. వ్యవసాయ విద్య, నిర్వహణ – 2,291 కోట్లు
4. ఉద్యానవన ప్రణాళిక – 860 కోట్లు
5. పశు ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత – 1,702 కోట్లు
6. కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం -1,202 కోట్లు
7. సహజ వనరుల నిర్వహణ – 1,115 కోట్లు
మరోవైపు వ్యవసాయ రంగంలో డిజిటల్ ఇన్నోవేషన్లకు మరింత మద్దతిచ్చేందుకు వచ్చిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి 2,817 కోట్లను కేటాయించారు. దీనికి మొత్తం మీద 20,817 కోట్లు కేటాయించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విధానంలో సాధారణ సాగు అంచనాల సర్వే అమలు వంటి ఐటీ ఆధారిత చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడతాయి. దీని కింద అగ్రిస్టాక్, కృషీ డెసిషన్ సపోర్ట్ సిస్టం, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ పేరిట మూడు డీపీఐలను రూపొందిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్నీ వుంచుతారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవమే దీని లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతి రైతుకూ ఆధార్ మాదిరిగా ఓ డిజిటల్ ఐడీని ఇస్తారు. దీనిని రైతు గుర్తింపు కార్డుగా పేర్కొంటారు. అందులోకి లాగిన్ అయిన మీదట సాగకు సంబంధించిన సమస్త సమాచారమూ వచ్చేస్తుంది.