కాలిఫోర్నియాలో దీపావళి పండుగను ప్రత్యేక రోజుగా ప్రకటించిన సర్కార్
వెలుగుల పండుగగా జరుపుకునే దీపావళిని ‘రాష్ట్ర ప్రత్యేక దినం’గా అధికారికంగా గుర్తిస్తూ గవర్నర్ గావిన్ న్యూసమ్ కీలక చట్టంపై సంతకం చేశారు. మంగళవారం నాడు ఆయన ఆమోదించిన ‘అసెంబ్లీ బిల్ 268’ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై దీపావళి రోజున వేతనంతో కూడిన సెలవును పొందేందుకు అవకాశం లభించింది. ఈ నిర్ణయంతో కాలిఫోర్నియాలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది దక్షిణాసియా వాసులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు విద్యాసంస్థలకు కూడా వర్తిస్తుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఈ చారిత్రక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, దాని ఆమోదానికి కృషి చేసిన భారతీయ సంతతికి చెందిన అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా, దర్శనా పటేల్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాన్ని సిలికాన్ వ్యాలీ పారిశ్రామికవేత్త, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ భుటోరియా మనస్ఫూర్తిగా స్వాగతించారు
ఈ చట్టం ద్వారా భారతీయ కుటుంబాలు ఎలాంటి పని ఒత్తిడి లేకుండా తమ సంప్రదాయాల ప్రకారం దీపాలు వెలిగించుకుని, రంగోలీలు తీర్చిదిద్దుకుని, బంధుమిత్రులతో ఆనందంగా గడిపేందుకు వీలు కలుగుతుందని అజయ్ భుటోరియా అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న దీపావళి సమీపిస్తున్న తరుణంలో వెలువడిన ఈ ప్రకటన, తమ సాంస్కృతిక వారసత్వానికి దక్కిన గొప్ప గౌరవంగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు.