రెండు సంవత్సరాలు సబ్సిడీ ఇస్తాం…. రైతులందరూ సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేయాలి : కేంద్ర ప్రభుత్వం పిలుపు
రైతులందరూ సహజ వ్యవసాయానికి (సేంద్రీయ) పెద్దపీట వేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. మొదట రెండు సంవత్సరాలు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులు తమ భూమిలోని కొంత భాగంలో సేంద్రీయ వ్యవసాయం చేసి, రెండేళ్ల పాటు సబ్సిడీని పొందాలని సూచించారు. గుజరాతనలో సేంద్రీయ వ్యవసాయంపై ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం ద్వారా మొదటి రెండు సంవత్సరాలలో దిగుబడి తక్కువగా వుంటుందని, అందుకే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. రసాయనాల నుంచి భూమాతను రక్షించాలన్న ప్రధాన మంత్రి కలలను సాకారం చేస్తూ… రైతులు రసాయన రహిత వ్యవసాయం చేయాలన్నారు. దీని ద్వారా రాబోయే తరాలు ఆరోగ్యంగా వుండేందుకు మనం దారిచూపిన వారం అవుతామన్నారు.
ఈ అంశంపై దేశంలోని కోటి మంది రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. తద్వారా వారు దేశంలోని ప్రతి మూలకు వెళ్లి, ప్రచారం చేయవచ్చని తెలిపారు. తమ ప్రభుత్వం నుంచి మాత్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి శతధా ప్రయత్నాలు చేస్తామని, ఇలా చేయడం ద్వారా రాబోయే తరాలు ఆరోగ్యంగా వుంటాయన్నారు. సేంద్రీయ వ్యవసాయం విషయంలో కోటి మంది రైతులకు అవగాహన కల్పిస్తామని, అందులో 18 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా ప్రతిజ్ఞ చేయిస్తామని వెల్లడిరచారు. ఉదాహరణకు ఓ రైతుకు 5 ఎకరాల వ్యవసాయ భూమి వుంటే… అందులోని ఒక ఎకరంలో ఈ తరహా వ్యవసాయం చేయాలన్నారు.
సేంద్రీయ వ్యవసాయ రంగంలో అధ్యయనాల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రయోగశాలలు కూడా ఏర్పాటు చేస్తామని వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఈ ప్రయోగ శాలలో నేల ఆరోగ్యం, బయో ఎరువులు మరియు జీవ పురుగుల మందుల ప్రభావాలను ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయం చేసేలా చూస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ ప్రకటించారు.