కొత్త సంవత్సరం రైతు నుంచే శ్రీకారం.. డీఏపీపై వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడగింపు
ఆంగ్ల నూతన సంవత్సరం రైతుల నుంచే మొదలైంది. నూతన సంవత్సరం రోజునే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా వుంటూ తొలి నిర్ణయం వారికే అంకితం చేశారు. రైతన్నలకు మరింత చేయూతనిచ్చేలా అమ్మోనియం పాస్పేట్ (డీఏపీ) పై అదనపు రాయితీ గడువును పొడిగించింది. అదనపు రాయితీ కింద 3,850 కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ పచ్చా జెండా ఊపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైతులకు 50 కిలోల డీఏపీ బస్తా 1,350 రూపాయలకే అందుబాటులో వుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది. జనవరి ఒకటో తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ ప్యాకేజీ కింద టన్ను డీఏపీ రాయితీని కొనసాగిస్తారు. తక్కువ ధరలకే రైతులకు డీఏపీ అందించాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు వున్నా… మన దేశంలో 2024,25 రబీ, ఖరీఫ్ సీజన్ లో తగినంత డీఏపీ అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
డీఏపీపై వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడగింపు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైతన్నలు 50 కిలోల డీఏపీని ఇకపై కూడా 1,350 రూపాయలకే కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. డీఏపీపై వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీ 3,850 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆఈమోదించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో డీఏపీ ధరలు పెరుగుతున్నాయన్నారు. 2014 నుంచి 2024 దాకా ఎరువుల రాయితీ కోసం కేంద్రం 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
నూతన సంవత్సరంలో కేబినెట్ సమావేశంలో తీసుకున్న మొదటి నిర్ణయాన్ని రైతు సోదరులకు, సోదరీమణులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పంటల బీమా పథకాలకు నిధుల కేటాయింపులు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో ఆమోదించామని పేర్కొన్నారు. దీని వల్ల పంటలకు మరింత భద్రత లభిస్తుందని, పంటలకు నష్టం వాటిల్లినా రైతులు దిగులు పడాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు. డీఏపీపై వన్ టైమ్ ప్రత్యేక ప్యాకేజీ గడువును పెంచడంతో తక్కువ ధరకే ఎరువు లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.