రైతుల కోసం 15 లక్షల ఆర్థిక సాయం… కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకమిదీ….
భారత్ లో ఇప్పటికీ సగం మంది వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. రానూ రానూ వ్యవసాయం కూడా పెట్టుబడి అధికంగా వుండే రంగంగా మారిపోయింది. రైతులు పెట్టుబడి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా… అమలు విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే… కేంద్రంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపింది. మొన్నటికి మొన్నే కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రైతుల కోసం అనేక పథకాలను కూడా అమలు చేస్తోంది.
అందులోభాగంగా వారి ఆర్థిక ప్రయోజనాలు అందించడం కోసం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. దాంతో ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేల నగదు విడతల వారీగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో పడుతుంది. ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇంతకీ ఈ స్కీమ్ ఏమిటి.. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే.. ఇలా చేసుకోవాలి.
ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం (PMKFPO)
రైతులను వాణిజ్యపరంగా బలోపేతం చేయడానికి, వారిని స్వావలంబన చేయడానికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ ఎఫ్‌పీవో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 11 మంది రైతులు సమూహంగా ఏర్పడాలి. అంటే రైతు ఉత్పత్తిదారు సంస్థ (FPO)గా ఏర్పడి.. వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం రూ.15 లక్షలు ఆర్థిక సహాయంగా అందజేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. ఈ సంస్థలో కనీసం 11 మంది రైతులు ఉండాల్సి ఉంది. అప్పడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
మీరు రైతు అయితే..ఎఫ్‌పీవో ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే.. మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఈ పథకం అధికారిక వెబ్ సైట్ https://www.enam.gov.in లోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత.. లాగిన్ అవ్వాలి. ఆ క్రమంలో మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం, మీరు FPO యొక్క ఎండీ (MD) లేదా సీఈవో (CEO) లేకుంటే మేనేజర్ పేరు, చిరునామా, ఇ-మెయిల్ IDతోపాటు సంప్రదింపు నంబర్ అందించాల్సి ఉంటుంది.