పెట్రో ధరలు పెరగవు : కేంద్రం క్లారిటీ
ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.28 వరకూ పెరిగే ఛాన్స్ ఉందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని పేర్కొంది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేస్తున్నాము. ప్రజల్లో భయం, కంగారు కలిగించేందుకు ఇలాంటి కథనాలను సృష్టిస్తుంటారు. ఇవి జనాల్ని తప్పుదారి పట్టించే కథనాలు’ అని పెట్రోలియం మంత్రి శాఖ పేర్కొంది.
గత నాలుగేళ్లల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని దేశం భారత్ ఒక్కటే అని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజలపై ధరాభారం పడకుండా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు నిరంతరం అనేక చర్యలు తీసుకుంటున్నాయని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది.