కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 60 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఇది 2 శాతం పెరుగుదల అని తెలిపారు. ఇంతకు ముందు ఇది 58 శాతంగా వుండేదని, తాజాగా దానిని 60 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది పేర్కొన్నారు. ఈ పెంపు 2026 జనవరి 1 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి నుండి ఏప్రిల్ వరకు గల కాలానికి సంబంధించిన బకాయిలను కూడా పొందుతారు. DA పెంపు ఫలితంగా, ఒక ప్యూన్ నుండి IAS అధికారి వరకు — అందరి జీతాల్లోనూ పెరుగుదల ఉంటుంది. దీని ద్వారా 49.19 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.72 లక్షల పెన్షనర్లు లాభపడతారు.
కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించడానికి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. పూల్ ఏర్పాటు కోసం 12,980 కోట్లు నిధులు కేటాయించింది.
అలాగే రాజమండ్రి – విశాఖ మధ్య 3,4 రైల్వే లైన్ల నిర్మాణానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. 9889 కోట్ల రూపాయలతో రాజమండ్రి – విశాఖ మధ్య రైల్వే లైన్ల ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిడదవోలు – దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లను నిర్మించాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారని తెలిపారు.
అలాగే మధ్య ప్రాచ్య ప్రాంతంలోని సంఘర్షణలు, యుద్ధాల కారణంగా జరిపే షిప్పింగ్ రిస్కులను ఎదుర్కోడానికి కేంద్రం మారిటైమ్ ఫండ్ లేదా భారత్ మారిన్ పూల్ను ఆమోదించింది. ఇది సుమారు 930 నుంచి 1000 కోట్ల సామర్థ్యతో ఏర్పాటు చేస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ వంటి పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని నిర్వహిస్తాయి. హల్, కార్గొ, ప్రొటెక్షన్, ఇండెమ్నిటీ కవరేజీలు అందించబడతాయి. ఇది విదేశీ రీ ఇన్సూరెన్స్ పై ఆధారపడటం తగ్గించి, భారతీయ షిప్పింగ్ ను రక్షిస్తుంది. ప్రస్తుతం పెరిగిన యుద్ధ రిస్క్ ప్రీమియంను ఎదుర్కోడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.
అలాగే కసారా – మన్మాడ్, ఢిల్లీ – అంబాలా, బల్లారి – హోస్ పేట, గమరియా – చండిల్ మల్టీ ట్రాకింగ్ 9,072 కోట్లను మంజూరు చేసిందని మంత్రి ప్రకటించారు. ఈఆ ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ, హర్యానా, కర్నాటక వంటి రాష్ట్రాలలో అమలవుతాయి.