రైతులకు గుడ్ న్యూస్… పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-2026 మార్కెటింగ్ సీజన్ కి గాను రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. క్వింటాల్ గోధుమపై కనీస మద్దతు ధరను తాజాగా 150 రూపాయలకు పెంచింది. దీంతో గతంలో 2275 గా వున్న కనీస మద్దతు ధర 2425 రూపాయలకు పెరిగినట్లు ఆయన వివరించారు. అలాగే ఆవాల పంట కనీస మద్దతు ధరను కూడా పెంచింది.
ఆవాలు పంటపై క్వింటాకి 300 రూపాయల చొప్పున పెంచారు. అంటే 5,650 రూపాయల నుంచి 5,950 రూపాయలకు పెరిగింది. అలాగే కందుల ఎమ్మెస్పీని క్వింటాల్ కి 210 రూపాయలు పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్త ధర 6,700 కి చేరింది. కుసుమ పంట ధర 5,800 రూపాయల నుంచి 140 రూపాయలు పెరిగి, 5,940 రూపాయలకు చేరింది. వీటితో పాటు పెసరకు 275 రూపాయలు, శనగ పంటకు క్వింటాల్ పై 210 రూపాయలు, ప్రొద్దుతిరుగుడు పంటకు 140 రూపాయలు, బార్లీకి 130 రూపాయల చొప్పున ఎమ్మెస్పీని పెంచారు.
ఇక.. ఈ నిర్ణయంతో పాటు కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్’’కి 35 వేల కోట్లు ఇచ్చేందుకు కూడా ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్ కి సంబంధించి నాన్ యూరియా ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీకి కూడా అంగీకరించింది