నక్సలిజంపై ఇదే తుది సమరం : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నక్సలిజంపై అంతిమ పోరుకి సమయం ఆసన్నమైందని, ఇదే తుది సమరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి నక్సలిజం అంతమవుతుందని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ కేంద్రంగా ఏడు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల డీపీజీలు, సీఎస్ లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నక్సలిజం కారణంగా 17 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వామపక్ష తీవ్రవాదాన్ని తాము సవాల్ గా తీసుకున్నామని, దాపనిపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటి వరకు 147 మంది నక్సలైట్లు హతమయ్యారని, అలాగే 723 మంది నక్సలైట్లు అరెస్టయ్యారన్నారు.
రానున్న మూడు సంవత్సరాల్లో ఛత్తీస్ గఢ్ నక్సల్ రహిత రాష్ట్రంగా మారుతుందని ప్రకటించారు. అలాగే నక్సల్స్ హింసను విడనాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే వీరి లొంగుబాటుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంబించనుందని ప్రకటించారు. 2004 -14, 2014-24 కాలాన్ని తీసుకుంటే నక్సల్స్ సంబంధిత ఘటనల్లో ఏకంగా 53 శాతం తగ్గుదల కనిపిస్తోందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను పెంచామని, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేశామని వివరించారు. ఈ అంశాలతో పాటు జాతీయ సంస్థలైన ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలు కూడా మావోయిస్టుల ఆర్థిక మూలాలను తుడిచేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.