సమాజంలో మార్పు తీసుకురావడానికే ’’లోక్ మంథన్‘‘ లాంటి కార్యక్రమాలు : కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రపంచ వ్యాప్తంగా నేడు భారతీయ సంప్రదాయంపై ఆకర్షితులవుతున్నారని, బాగా ఆదరిస్తున్నారని, కానీ.. కొన్ని సంస్థలు దీనికి భిన్నంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అంతేకాకుండా వాస్తవ చరిత్రను తెరమరుగు చేస్తూ, అర్థం పర్థం లేని సంస్కృతిని తెరపైకి తెచ్చి, అనవసరపు విషయాలను సమాజంలోకి తీసుకొచ్చి, చీలికలను తెస్తున్నారని, సనాతన ధర్మం విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ‘‘లోక్ మంథన్ భాగ్యనగర్ -2024 పేరుతో నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవ చరిత్రను తెరుమరుగు చేస్తూ.. తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం అత్యంత అవసరం అని అన్నారు. ఈ ఆధునిక సమాజంలో మార్పు అనేది సర్వ సాధారణమని, కానీ… మంచి, చెడు అన్న దాని నుంచి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగడంతో పాటు సమాజంలో ఓ మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో లోక్ మంథన్ కార్యక్రమం ఏర్పాటైందన్నారు. హిందూ సంస్కృతి నిరంతరం ప్రవహించే జీవ నది అని, అందులో స్వచ్ఛత వుంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఎంతో ఉపయోగకరమని బండి సంజయ్ అన్నారు.