అంత్యోదయ, ఏకాత్మమానవతాకి సేవా భారతి అంకితం : రాజ్ నాథ్ సింగ్
కోవిడ్ మహమ్మారి సమయంలో, ఇతర క్లిష్ట సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఉప శమనం కలిగించేందుకు సేవా భారతి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. సేవా భారతి ప్రేరణతో నిస్వార్థంగా చాలా మంది సేవ చేశారు. ఆ వ్యక్తులను మరింత ప్రోత్సహించడానికి సేవా భారతి ఢిల్లీ ఆధ్వర్యంలో వ్యక్తులు, సంస్థలకు ఓ సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సహకార్యవాహ్ అలోక్ కుమార్ మాట్లాడుతూ… సామాజిక అసమానతలను రూపుమాపడానికి సేవ ఏకైక మార్గమని అన్నారు.సేవ అనేది ఓ దైవిక కార్యక్రమమని సమాజంలోని ప్రతి వర్గం తప్పనిసరిగా సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి, మనో ధైర్యాన్ని గణనీయంగా పెంచేందుకు సేవా సమ్మాన్ అవార్డులతో సత్కరిస్తున్నామని, ఈ సంఖ్య వచ్చే యేడాది మరింత పెరగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్దిలోకి ప్రవేశించిందని, ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాన్ని మరింత పెద్ద సంఖ్యలో జరగాలని, నెహ్రూ స్టేడియంలో జరిపితే మరింత మందికి ప్రోత్సాహకరంగా వుంటుందన్నారు. ఇతరులకు సాయం చేస్తే పుణ్యం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయని, ఇతరులకు ఇబ్బంది కలిగించడం పాపమని అన్నారు. ప్రాథమిక అవసరాలు లేని వారికి సాయం చేయడం ధర్మబద్ధమైన పని అని, సేవా భారతి వ్యక్తిగత స్థాయిలో సామరస్య స్ఫూర్తితో సేవ చేయాలని విశ్వసిస్తోందన్నారు.
ఇక.. ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సేవా భారతి అట్టడుగు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. ఈ ప్రయత్నాలు నిస్సందేహంగా విశ్వ గురువుగా తన స్థానాన్ని తిరిగి పొందుతుందని, సమ్మిళిత సమాజం భారత దేశ లక్ష్యం వైపు తీసుకెళ్లడానికి దోహదపడతాయన్నారు. ప్రభుత్వాలతో పాటు దేశ పౌరులు కూడా సమగ్ర సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా భారతి కార్యకర్తలు ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ ఆలోచనలకు అంకితమైందని అభినందించారు.
సేవా భారతిని బాలాసాహెబ్ దేవరస్ స్థాపించారని, భయ్యాజీ జోషి వంటి వారు మరింత బలోపేతం చేశారని రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఆరెస్సెస్ కేవలం దేశ నిర్మాణం మాత్రమే చేయదని, వ్యక్తి నిర్మాణం కూడా చేస్తుంన్నారు. ఇప్పుడు వచ్చిన మార్పులు, కమ్యూనికేట్ చేసే విధానాలు, ఉపయోగించే భాష.. ఇవన్నీ సంఘ్ నుంచి వచ్చిన ఫలితాలేనని ప్రకటించారు. అసాధ్యమనుకున్న వాటిని ఓ వ్యవస్థీకృతంగా పనిచేస్తూ ఫలితాలు సాధించడం ఎలాగో సేవా భారతి ప్రత్యక్ష తార్కాణమన్నారు. సేవ అనే రంగం వ్యక్తిని, దేశాన్ని రెంటినీ నిర్మిస్తుందని, సేవా భారతి నిరంతరం దీనికి సహకరిస్తోందని పేర్కొన్నారు.