రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే : ఖమ్మం పర్యటనలో కేంద్ర మంత్రి శివరాజ్

ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించింది. సాధారణ ప్రజానీకంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మంలో పర్యటించారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించారు. దీని తర్వాత పాలేరుకు చేరుకున్నారు. పాలేరులో వర్షం వల్ల వరదల వల్ల జరిగిన నష్టాన్ని రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా పరిశీలించారు. అక్కడే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఛాపర్ ద్వారా ప్రత్యక్షంగా తిలకించానని తెలిపారు. వరి పంట బాగా నష్టపోయిందన్నారు. అలాగే ఇళ్లలోని సామాను, వంట సామాగ్రి, ఆవులు, గేదెలు కూడా నష్టపోయాయని తెలిపారు. ఖమ్మం ప్రజలకు సాయం చేయడానికే తాను ఇక్కడికి వచ్చానని, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. రైతులకు కష్టకాలం వచ్చిందని, ఎవ్వరూ కంట నీరు పెట్టుకోవద్దని, రైతులకి ఏ విధంగా సహకరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమన్వయంతో సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఖమ్మం రైతులకు, ప్రజలకు ముగ్గురు మంత్రులు వున్నారని, సీఎం రేవంత్ కూడా వున్నారని భరోసా ఇచ్చారు. రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని స్పష్టం చేశారు. కేంద్రం తరపున వరద బాధితులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు. సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుందని, గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని, తాను కూడా రైతునేనని తెలిపారు. రైతుల పరిస్థితి ఏమిటో బాగా తెలుసని, కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్తామని శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *