పోర్టు బ్లెయిర్ పేరు మార్పు… ఇకపై ‘‘శ్రీ విజయపురం‘‘ గా మార్పు
వలసవాద ధోరణులను తుడిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తూ… ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. వలసవాద ధోరణులను తుడిచేసి, భారత దేశ అస్తిత్వాన్ని గుర్తు చేసేవిధంగా పోర్టు బ్లెయర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపై పోర్టుబ్లెయిర్ ను శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం వుందని, వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టామని వివరించారు. అండమాన్ దీవుల నుంచే మొదటి సారి నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఈ దీవుల ప్రాంతం ఒకప్పుడు చోళులకు నౌకా స్థావరంగా ఉందని వెల్లడించారు. ఇవాళ భారత్ కు వ్యూహాత్మకంగా కీలక స్థావరంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరసావర్కర్, ఇతర సమర యోధులను నిర్బంధించింది ఇక్కడి సెల్యులర్ జైలులోనే అని అమిత్ షా వివరించారు. మరోవైపు బ్రిటీష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీద ఈ పట్టణానికి పోర్ట్ బ్లెయిర్ అనే పేరు వచ్చింది.