కుంభమేళాతో ప్రయాగరాజ్, అయోధ్య, కాశీకి కొత్త కోణాన్ని అద్దింది : చంపత్ రాయ్
మహా కుంభమేళా ప్రయాగరాజ్,అయోధ్య, కాశీ క్షేత్రాలకు కొత్త కోణాలను అద్దిందని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ అభిప్రాయపడ్డారు.సనాతన ధర్మంలో చాలా కాలంగా వున్న విశ్వాసం, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత మేల్కొలుపు సంగమం మహా కుంభమేళా అని అభివర్ణించారు. ఆర్గనైజర్, పాంచజన్య సంయుక్తంగా నిర్వహించిన మంథన్ లో ఆయన మాట్లాడారు. మతపరంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ప్రజల్లో ఉత్సాహాన్ని మరింత బలోపేతం చేసిందని, ప్రయాగరాజ్, అయోధ్య, కాశీని అనుసంధానించే పరివర్తనాత్మక తీర్థయాత్రగా మిగిలిపోయిందన్నారు.
తనకు 1989 నుంచీ కుంభమేళాతో అనుబంధం వుందని చంపత్ రాయ్ అన్నారు. ఓ నెల పాటు అక్కడే వుండేవాడినని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా వసంత పంచమి తర్వాత సందర్శకుల సంఖ్య తగ్గుతుండేది. కానీ.. ఈసారి మార్చి 1 వరకూ రద్దీగానే వుందన్నారు. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత ఈ మహా కుంభమేళా వచ్చిందని, అందుకే అంత రద్దీ అని వివరించారు. ఈ మహా కుంభ్ లో తాము భాగస్వాములం కావాలని అందరూ భావించారని, దీని ప్రభావం అయోధ్యకు కూడా విస్తరించిందన్నారు. జనాన్ని నియంత్రించడానికి ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకి నాలుగు సార్లు ప్రయాణించానని వెల్లడించారు. సాధారణంగా నాలుగు గంటలు మాత్రమే పడుతుంది కానీ… కుంభ్ సమయంలో 10 గంటలు పట్టిందని తెలిపారు.
అయితే.. కుంభమేళా సమయంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. కానీ.. 24 గంటల్లోనే వాటిని పరిష్కరించారన్నారు. ఇక.. జనవరి 15 మొదలు ఫిబ్రవరి 18 మధ్య ప్రతి రోజూ4 లక్షలకు పైగా ప్రజలు అయోధ్యను దర్శించారని, ప్రయాగరాజ్, అయోధ్య మధ్య రోజూ 10 రైళ్లు నడిచాయన్నారు.ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీ ఈ మూడు తీర్థ స్థలాలూ సమాజానికి అపారమైన ప్రయోజనాలను తెచ్చి పెట్టిందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచిందన్నారు. గతంలో రోజూ 100 రూపాయలు సంపాదించే వారు ఇప్పుడు 1,500 రూపాయల వరకూ సంపాదిస్తున్నారని వెల్లడించారు.
గతంలో కూడా ప్రజలు అయోధ్యను సందర్శించేవారని, కానీ సంఖ్య తక్కువగా వుండేదని చంపత్ రాయ్ అన్నారు. కానీ.. 2020 లో రామాలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత హనుమాన్ గర్హి వద్ద భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. శని, మంగళవారాల్లో దాదాపు 25 వేల మంది దర్శించడం ప్రారంభమైందని, కానీ.. జనవరి 22,2024 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య 75 వేలకు పెరిగిందని, వారాంతాల్లో అది లక్షకు చేరుకుందని ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 22,2024, జనవరి 22,2025 మధ్య దాదాపు 4 కోట్ల మంది అయోధ్యను సందర్శించారన్నారు.
మరోవైపు 2011 తో పోలిస్తే… అయోధ్యలో 60,000 జనాభా వుండే ఓ చిన్న నగరమని, 2018 లో మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత దాని మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. గతంలో అయోధ్య రోడ్లు ఇరుకుగా వుండేవని, పరిశుభ్రత ఓ సవాల్ గా వుండేదన్నారు. 2017 నుంచి ప్రభుత్వం ఈ సమస్యలను ఓ క్రమపద్ధతిలో పరిష్కరిస్తూ వస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా చంపత్ రాయ్ ఓ ఉదాహరణను వెల్లడించారు. అయోధ్యలో ఈ రిక్షా కొనడానికి ఓ వ్యక్తి లక్ష రూపాయల రుణం తీసుకున్నాడని, కేవలం రెండు పాయింట్లలోనే దీనిని నడుపుతూ… నెలలోనే రుణాన్ని తిరిగి చెల్లించాడని వెల్లడించారు. ఆలయం నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా పరిపుష్టం అవుతుందని ప్రశ్నించేవారని, ఆత్మ గౌరవం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారన్నారు. కానీ… అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మతపరమైన టూరిజం పెరిగిన తర్వాత ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు.
ఫిబ్రవరి 5,2020 నుంచి ఫిబ్రవరి 28,2025 మధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ సామాగ్రి కొనుగోలు, విద్యుత్ బిల్లులతో జీఎస్టీ, టీడీఎస్ ద్వారా ప్రభుత్వ ఖజానాకి 375 కోట్లు వచ్చిందన్నారు.