చంద్రప్రకాష్ ద్వివేదీకి ‘హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ 2024’ అవార్డు

ఈ యేడాది డాక్టర్ హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ 2024 కార్యక్రమం కోల్ కత్తాలో జరిగింది. ఈ యేడాదికి ఈ అవార్డు డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేదికి లభించింది. సినీ పరిశ్రమలో వుంటూ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న చంద్రప్రకాష్ ద్వివేదీకి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ అవార్డును బహూకరించారు.ప్రముఖ జర్నలిస్టు, గాయకుడు ఓంప్రకాష్ మిశ్రా అందించిన వందేమాతరం, జాతీయ గీతం జనగణమనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ముఖ్య వక్తగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. హెడ్గేవార్ కి కోల్ కత్తాతో వున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంఘ్ స్థాపన కంటే ముందే బెంగాల్ తో ఆయనకు సంబంధం వుందని, ఆయన చదువుకునే రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారని, బెంగాల్ నుంచే వందేమాతరం ప్రారంభమైందన్నారు. జాతికి అంకితమైన వ్యక్తుల అవసరాన్ని హెడ్గేవార్ గుర్తించి, 1925 లో కేవలం 17 మందితో ఆరెస్సెస్ కి పునాది వేశారని అన్నారు. అప్పట్లో సంఘ్ ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాల్ గా వుండేదన్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై కూడా సునీల్ అంబేకర్ బాధపడ్డారు. ఆ దాడులు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అంత జరుగుతున్నా… అక్కడి హిందూ సమాజం ఐక్యంగా నిలబడిందని, వారి నుంచి మనమందరమూ ఐక్యత నేర్చుకోవాలని సూచించారు.
ఇక… హెడ్గేవార్ పురస్కార గ్రహీత చంద్రప్రకాష్ ద్వివేదీని వక్తలు కొనియాడారు. భారతీయ నాగరికతను, సంస్కృతిని ఆయన సజీవంగా వుంచుతున్నారని వక్తలు కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం కూడా వరించిందన్నారు. ఆయన రచనలు భారతీయతకు, హిందూత్వకు పర్యాయ పదాలు అని పేర్కొన్నారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కొనియాడారు. భగవద్గీత కేవలం చదవడానికి మాత్రమే కాదని, అందులోని సందేశాన్ని జీవితంలో అమలు చేయాలని సూచించారు. దారా షికో వంటి వ్యక్తి ఉపనిషత్తులను అనువదించడం ద్వారా భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేశారని గుర్తు చేశారు.ఔరంగజేబు దారా షికోను ఉరివేసి చంపడమే కాకుండా, అతని జ్ఞాన సంపదను నాశనం చేయడానికి కూడా ప్రయత్నించాడు. అతను దారా షికో ద్వారా పార్సీ భాషలోకి అనువదించబడిన ఉపనిషత్తుల కాపీలన్నింటినీ తగలబెట్టాడని గుర్తు చేశారు. అయినా… కొన్ని కాపీలను ఆయన దాచిపెట్టారని, తరువాత అవి యూరప్ కి చేరుకున్నాయని, అక్కడ సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రారంభించాయన్నారు.చివరి శ్వాస వరకు జ్ఞాన సముపార్జనలో నిమగ్నమై ఉండటమే భారతీయ సంస్కృతి ప్రాథమిక లక్ష్యమని వివేకానంద పేర్కొన్నారని గవర్నర్ గుర్తు చేశారు. అలాగే భారతీయ పునరుజ్జీవనమే డాక్టర్జీ లక్ష్యమని పేర్కొన్నారు.
చంద్రప్రకాష్ ద్వివేదీ నేపథ్యమిదీ…
చంద్రప్రకాష్ ద్వివేది ప్రముఖ రచయిత, దర్శకుడు మరియు నిర్మాత, భారతీయ సంస్కృతి మరియు చరిత్రను కేంద్రంగా ఉంచుతూ అనేక ప్రసిద్ధ రచనలను రూపొందించారు. అతను జూన్ 6, 1960 న రాజస్థాన్‌లోని షిరోహి జిల్లాలోని దోడియా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.ప్రాథమిక విద్య తర్వాత అతను మెడిసిన్ చదివారు, కానీ అతని ఆసక్తి సాహిత్యం మరియు కళల వైపు సాగింది. డా. ద్వివేది టీవీ సీరియల్ “చాణక్య” (1991)తో విస్తృతమైన కీర్తిని పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *