నీతిని వదిలిపెట్టని నిష్ట

చంద్రశేఖర ఆజాద్‌ ‌గొప్ప దేశభక్తుడు, విప్లవకారుడైనా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతనివద్ద ఒక్క అణా మాత్రమే మిగిలింది. అది ఖర్చయిపోతే రేపు ఎలా గడుస్తుందన్నది ప్రశ్న. కానీ ఆ రోజుకు ఆకలి తీరితే రేపటి గురించి ఆలోచించుకోవచ్చని అణాపెట్టి శనగలు కొనుక్కుని తినసాగాడు. తింటూ తింటూ చివరి పిడికిలి నోట్లో వేసుకోబోతుండగా చేతిలో ఏదో చల్లగా తగిలింది. చూస్తే అరచేతిలో పావలా బిళ్ల. పావలా దొరకటంతో రేపటి సమస్య తీరినట్లే కదా అనిపించింది. కానీ అంతలోనే ఎంతో పేదవాడైన శనగలు అమ్మేవాడు గుర్తుకు వచ్చాడు. ఇది అతని డబ్బు కదా అనిపించింది. ఆ పావలా మీద తనకు ఎలాంటి అధికారం లేదనిపించింది. వెంటనే శనగల వాడి దగ్గరకు వెళ్ళి పావలా అతని చేతిలో పెట్టి ‘‘ఇందాక నీ దగ్గర కొనుక్కున్న శనగల్లో ఇది దొరికింది’’ అని ఇచ్చేశాడు. శనగలవాడు ఎంతో సంతోషించాడు. అతని సంతోషం చూసి ఆజాద్‌ ‌చిరునవ్వు నవ్వాడు. మరునాటి భోజన సమస్య అలాగే మిగిలిపోయింది. పేదప్రజల పట్ల ఆజాద్‌కున్న ప్రేమ అలాంటిది. ఎలాంటి కష్టంలోనైనా నీతిని వదిలిపెట్టని నిష్ట అలాంటిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *