4 శతాబ్దాలుగా భారత్‌లో చర్చి దురాగతం
హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారమని మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తోందా? ఈ దేశంలో చర్చి చరిత్ర చూస్తే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతుంది.
తమిళనాడు రాష్ట్ర దళిత క్రైస్తవుల విముక్తి ఉద్యమ నాయకుడు మరియా జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే భారతదేశంలో చర్చి నిమ్న వర్గాలపై సాగిస్తున్న కులవివక్ష తీవ్రత అర్ధమవుతుంది.
2020 డిసెంబర్ 3న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి-కడలూరు ఆర్చిడయోస్ కేంద్ర కార్యాలయం వద్ద దళితులుగా పేర్కొనే షెడ్యూల్డ్ కులాలకు చెంది మతంమారిన క్రైస్తవులు భారీ నిరసన చేపట్టారు. కారణం? హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారిన తమకు సామాజికన్యాయం అందకపోవడం. పాస్టర్లు, బిషప్పుల నియామకంలో తమకు అగ్రకుల క్రైస్తవ సమాజం నుండి ఎదురవు తున్న వివక్ష. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ సామాజిక అన్యాయాన్ని ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఎస్సీ క్రైస్తవ సమాజం ఇక లాభంలేదనుకుని ఈ అణచివేతకు నిరసనగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించింది.
భారతదేశంలో చర్చి దృష్టి నిజంగా సామజిక న్యాయం మీదనే ఉందా? లేక కేవలం మత మార్పిడులే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందా? అసలు క్రైస్తవంలోకి మారిన వ్యక్తుల సామజిక అభివృద్ధికి చర్చి కనీసం ప్రయతిస్తోందా? అన్నవి కీలకమైన ప్రశ్నలు.
2008లో తమిళనాడులోని ఎరైయూర్ పట్టణంలో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన క్రైస్తవుల మధ్య జరిగిన గొడవ హింసాత్మక ఘటనలకు దారితీసింది. చర్చిలో అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష, అంటరానితనంతో విసిగిపోయిన ఎస్సీ క్రైస్తవులు తమకు తాము సొంతంగా చర్చి ఏర్పాటు చేసుకున్నారు. తమ చర్చిని అధికారికంగా గుర్తించాలని ఆర్చిడయాసిస్‌ను అభ్యర్ధించారు. దీంతో మొదలైన గొడవ పోలీసుల కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఆ ప్రాంతంలోని అనేక చర్చిలకు ఎస్సీ క్రైస్తవులు తాళాలు వేసి మూసివేశారు.
2011లో చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని తాచూర్ గ్రామంలో క్రైస్తవుల్లోని అగ్రకుల, నిమ్న కులాల ప్రజల మధ్య తీవ్ర అల్లర్లు చోటుచేసు కున్నాయి. ఎస్సీ వర్గానికి క్రైస్తవుడి పార్ధివదేహాన్ని అగ్రకుల క్రైస్తవుల శ్మశానవాటికలో ఖననం చేసేందుకు ప్రయత్నించగా రెడ్డి కులానికి చెందిన క్రైస్తవులు అడ్డుకున్నారు. ఈ అంశంపై ది ఫ్రంట్-లైన్ ప్రచురించిన కథనం ప్రకారం వారి చర్చి నిర్మాణం నక్షత్రాకారంలో ఉంది. ఇందులో మధ్య భాగంలో కూర్చునే అర్హత ఆ చర్చిని నిర్వహిస్తున్న రెడ్డి క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉండే కోణాల ఆకృతిలో ఉన్న మూలల్లో మాత్రమే అరుంధతీయార్లు, ఆది ద్రావిడర్లు మొదలైన వర్గాలకు చెందిన దళిత క్రైస్తవులు కూర్చుని ప్రార్ధనల్లో పాల్గొనాలి. వీరికి చర్చి నిర్వహణలో ఎలాంటి పాత్ర లేదు.
తిరుచ్చిలోని ఇదే రీతిలో నిర్మింతమైన మరో శ్మశాన వాటికలో అగ్రవర్ణ, దళిత క్రైస్తవుల కోసం మధ్యలో ఓ విభజన గోడ ఏర్పాటు చేశారు.
‘విభజించి పాలించడం’ అనేది నైజంగా కలిగిన చర్చి నిజానికి కులపరమైన వివక్ష, అంటరానితనం వంటి పద్ధతులను 400 ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ 400 ఏళ్లుగా భారతదేశంలో చర్చి సామాజిక అంశాలకు కాకుండా కేవలం మతమార్పిళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ‘కుల వివక్ష నుండి విముక్తి’ సాకుతో మతమార్పిళ్లు సాగిస్తూ నిమ్నవర్గాల వారిని మతపరంగా వంచనకు గురిచేస్తోంది.
తొలితరం యూరొపియన్ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో కాలుమోపే నాటికే అక్కడి సమాజంలో క్రైస్తవేతర విశ్వాసాల పట్ల తీవ్రమైన అసహనం, సామాజిక వివక్ష వంటి లక్షణాలు అంతర్భాగాలుగా ఉండేవి. భారతదేశంలో సమసమాజ స్థాపన లక్ష్యం అని నిత్యం ఊదరగొట్టే మిషనరీలు, తమ క్రైస్తవ సమాజం విషయంలోనే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు. తమ ఏకైక లక్ష్యమైన మతమార్పిడికి అనుకూలంగా హిందూ సమాజంలో కుల విభజనలను సృష్టించి, ఆ విభజనను తమకు అనుకూలంగా మలచుకున్నారు.
ఈ 21వ శతాబ్దంలో కూడా దళిత క్రైస్తవులు సమానహక్కులు, అవకాశాల కోసం వీధికెక్కి పోరాటం చేస్తున్నారంటే కారణం సామాజిక న్యాయం ముసుగులో సామాజిక రుగ్మతలను అవకాశంగా తీసుకుని చర్చి జరుపుతున్న మతమార్పిళ్లే.
– కె. సహదేవ్