ఎవరు ఎన్ని కుట్రలు చేసినా శివాజీ మహారాజ్ హృదయాల్లో పదిలంగా వున్నారు : దత్తాత్రేయ హోసబళే
ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి హైందవీ స్వరాజ్ పట్ల, దేశం పట్ల అపారమైన ప్రేమతో వుండేవారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. తన ఆదర్శమైన చర్యల ద్వారా, దేశభక్తిని అందరిలో పెంపొందించారని, మొఘలులను ఓడిరచడం ద్వారా హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించారని తెలిపారు. ఢిల్లీలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి సంబంధించిన ఎనిమిది పుస్తకాలను మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కలిసి దత్తాజీ ఆవిష్కరించారు.
కొందరు భారతదేశ విశిష్టమైన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ… ఛత్రపతి శివాజీ వారసత్వం భారతీయుల హృదయాల్లో పదిలంగా వుందని, చెక్కుచెదరలేదని సంతృప్తి వ్యక్తం చేశారు. శివాజీ కేవలం మరాఠాల గురించే మాట్లాడలేదని, మొత్తం హైందవీ స్వరాజ్యం కోసమే పరితపించారని గుర్తు చేశారు. వారు చూపిన మార్గం మరాఠాలకు అటక్ నుంచి కటక్ వరకూ కాషాయ జెండా ఎగురవేయడానికి దారితీసిందని, భారతీయ సంస్కృతి వైభవాన్ని మరింత పెంచిందని తెలిపారు. ఛత్రపతి సూత్రాలు, ఆయన దార్శనికతను విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.
ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ దేశంలోని గొప్ప పాలకులలో ఒకరని, దేశానికి నిజమైన రూపశిల్పి ఆయనే అని కొనియాడారు. దేశంలో శివాజీ అత్యున్నత పాలకుడు అని, మన చరిత్రలో శివాజీ లాంటి యోధుడు లేకుంటే భారతీయ సంస్కృతి అంత గాఢంగా వుండేది కాదని అభిప్రాయపడ్డారు. జాతికి కర్తవ్య బోధ చేయడంలో, బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి పౌరులలో గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పాడని అన్నారు. ఇప్పటికీ ఇదే స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. శివాజీ చూపించిన సైనిక చతురత, వ్యూహాత్మక నిర్ణయాలు, స్ఫూర్తిమంతమైన అడుగులు ఎప్పటికీ ఆచరణాత్మకమన్నారు. శివాజీ తన పాలనలో ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, మతపరమైన, సాంస్కృతికపరమైన విలువలపై బాగా శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. ఐక్యత, సమగ్రత ప్రతిబింబించేలా అత్యంత విజయవంతంగా హైందవీ స్వరాజ్‌ను స్థాపించారని కోవింద్ ప్రశంసించారు.