పిల్లలకు సంస్కారం ఇవ్వాలి

మన పూర్వజులైన ఋషులు, మునులు చేసిన విశ్లేషణ ప్రకారం ఈ సృష్టిలో నాలుగు రకాల ప్రపంచాలున్నాయి. 1. పంచమహాభూతాలు, 2. వనస్పతి (వృక్షసంపద), 3. ప్రాణికోటి, జీవకోటి, 4. మానవులమైన మనం. ఇందులో పై 3 ప్రపంచాలు స్వతంత్రంకావు. ప్రకృతి నియమంతో బంధింపబడినాయి. మానవుడు మాత్రం స్వతంత్రుడు. దేవతలు కావడానికైనా, రాక్షసుడిగా మారడానికైనా అతడికే స్వతంత్రం ఉంది. కనుకనే మన పెద్దలు మానవుడు వికసించాలని, అతని హృదయంలో సంవేదనశీలుడు కావాలని చెప్పారు. కనుక వ్యక్తిని సంస్కరించే పని ముఖ్యమైనది. అందుకు కుటుంబమే వేదిక అని అన్నారు. ‘నేను’ నుంచి పరమాత్మ వరకూ వికాసం చెందేందుకు ప్రథమసోపానం కుటుంబం. దీన్ని బలపరచే ప్రక్రియ సంస్కారం. అందుకు మనకు షోడశ సంస్కారాలు ఇచ్చారు.

ఒక కుటుంబంలో కొడుకైనా, కూతురైనా తల్లిదండ్రుల కర్మల జన్మల పాపపుణ్యఫల స్వరూపంగా జన్మిస్తారు. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త రామానుజం తల్లి కోమలితమ్మాళ్‌, తండ్రి శ్రీనివా అయ్యంగార్‌. తల్లి కోమలితమ్మాళ్‌ రామానుజం గర్భంలో ఉన్న ప్పుడు  తన కొడుకు ఓ పెద్ద సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు, ఆ సింహాసనం చుట్టూ క్రింద యూరోపియన్లందరూ పాఠం నేర్చుకుంటున్నట్లు కల కన్నది. రామానుజం జన్మించి భారతదేశం గర్వించదగ్గ గణితశాస్త్రవేత్త అయ్యాడు. కేవలం 33సం.లు జీవించినా, మెట్రిక్యులేషన్‌ చదివినా 3900 పైచిలుకు గణిత సమస్యలకు సమాధానం అందించారు. నరేంద్రుడి తల్లి భువనేశ్వరీదేవి శివపూజలు చేసేది. శివుడే తన బిడ్డగా జన్మించినట్లు కలకన్నది. బిడ్డ కలిగినప్పుడు ఆమె ప్రేమతో వీరేశ్వరుడని పేరు పెట్టుకుంది. తల్లి పంచిన ప్రేమతోనే తానింతవాణ్ణయ్యాయని చెప్పుకున్నాడు. తల్లి ప్రతిరోజూ అతిథికి పెట్టిన తరువాత భోజనం చేయడం నరేంద్రుడు గమనించాడు. అదే ఆయనకూ అబ్బింది. వీధిలోపోయే భిక్షకులందరికీ అన్నీ ఇచ్చేస్తూండేవాడు.

హీరానంద్‌, నిహాల్‌దేవి దంపతులకు జన్మించిన తీర్థరాముడు గోస్వామి వంశానికి చెందినవాడు. శ్రీరాముడి గురువైన వశిష్టమహర్షి వంశంవారిది. తీర్థరాముడు మేనత్త ధర్మకూర్‌ పెంపకంలో పెరిగాడు. ఆమె గొప్ప భక్తురాలు. ఆ సంస్కారమే ఆయనకూ అబ్బింది. గుడిలో గంటల చప్పుడు, శంఖనాదం, పురాణ శ్రవణంతో ఆకర్షితుడయ్యాడు. దేశవిదేశాలు తిరిగి మాతృభూమి గొప్పతనాన్ని చాటాడు. ‘నేనే భారతము, భారతము నేనే’ అన్నాడు.

పెంపకం, ప్రాపకంలో పిల్లల్లో సంస్కారాలు వస్తాయి. తండ్రి ఆదిల్షా దర్బారులో పని చేస్తున్నప్పటికీ తల్లి ఇచ్చిన సంస్కారం వల్ల శివాజీ స్వాభిమానం, స్వరాజ్యకాంక్షతో పెరిగాడు. చివరికి హైందవీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

తల్లిదండ్రులు ఇచ్చే ఆచరణాత్మక సంస్కారమే పిల్లలను తీర్చిదిద్దుతుందనడానికి ఇలా అనేక ఉదాహరణలున్నాయి.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *