పిల్లలూ వర్గశత్రువులేనా!?

నక్సల్‌ ఉద్యమంలో మానవత్వానికి చోటులేదని మరోసారి ఋజువైంది. వారి వర్గ శత్రువుల్లోకి పాఠశాల విద్యార్థులు కూడా ఇప్పుడు చేరిపోవడం అత్యంత బాధాకరం. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు స్కూల్‌ విద్యార్థులను దారుణంగా హత్య చేశారు. బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు  క్రూరాతి క్రూరంగా వ్యవహరించి, ఓ గిరిజన బాలుడ్ని హత్య చేశారు. స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆ బాలుడ్ని హత్య చేసి, ఆ బాలుడి మృతదేహాన్ని ఊరి బయట విసిరేశారు. చివరికి గ్రామస్థులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 16 సంవత్సరాల ఈ బాలుడి పేరు సోయం శంకర్‌. దంతెవాడ జిల్లా పల్నార్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ బాలుడు చదువుతున్నాడు. మావోయిస్టుల ఈ దుశ్చర్యకు భయపడే… ఈ బాలుడ్ని తన కుటుంబీకులు సుక్మా నుంచి బయటికి తీసుకొచ్చి, దంతెవాడలోని పల్నార్‌ స్కూలులో చేర్పించారు. అయినా మావోయిస్టులు  ఆ బాలుడ్ని విడిచిపెట్టలేదు. సరిగ్గా ఐదారు రోజుల క్రితమే మృతుడి అన్న సోయం సీతారాంను కూడా మావోయిస్టులు హత్య చేశారు. అతని వయస్సు 19 ఏళ్లే. ఇలా తన కుటుంబాన్ని మావోయిస్టులు టార్గెట్‌ చేయడంతో భయపడిన తల్లిదండ్రులు ఆ గ్రామాన్ని విడిచి, వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.

నిజానికి తాము ప్రజల కోసమే అడవిబాట పట్టామని పదే పదే చెప్పే మావోయిస్టులు.. ఇన్‌ ఫార్మర్ల పేరుతో అనేక మంది అమాయక గిరిజనులను చంపేశారు. ఈ హత్య కూడా ఇన్‌ ఫార్మర్‌ అన్న నెపంతోనే చేసివుంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే… 16 సంవత్సరాల ఓ పాఠశాల విద్యార్థి ఇన్‌ ఫార్మర్‌ పాత్రను పోషిస్తాడా? అసలు ఆస్కారం వుందా? అన్నది ఆలోచించాలి. పాఠశాల విద్యార్థులను చూసి కూడా మావోయిస్టులు భయపడుతున్నారు.

ఈ రెండు ఘటనలు మరిచిపోక ముందే అదే ప్రాంతంలోని రాయ్‌పూర్‌లో మరో పౌరుడ్ని మావోయిస్టులు చంపేశారు. సుద్రు కరమ్‌ అనే వనవాసీని బలవంతంగా అడవుల్లోకి తీసుకెళ్లి మరీ కాల్చి చంపేశారు. కేవలం వారం రోజులలోపే ముగ్గుర్ని మావోయిస్టులు హత్య చేయడమంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంతకు మునుపు పూస్నార్‌, జైగూర్‌ అనే ప్రాంతాల్లో కూడా పౌరులను ఉరితీశారు. ఇందులో అత్యంత బాధాకరమైన అంశం ఏమిటంటే ఇన్‌ ఫార్మర్‌ అంటూ ఓ వృద్ధుడ్ని ఉరితీశారు. బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఓ నెల కాలంలోనే దాదాపు 30 మందిని వివిధ రకాల నెపంతో చంపేశారు.

వ్యాపారులు, ప్రజలను పీడిరచుకుతినే వారు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో వున్నవారు, రాజకీయ నేతలే తమ వర్గ శత్రువులని పదే పదే చెప్పే మావోయిస్టుల జాబితాలోకి ఇప్పుడు పాఠశాల విద్యార్థులు, వృద్ధులు కూడా చేరిపోవడం అత్యంత బాధాకరం. పాఠశాల విద్యార్థుల్ని హత్య చేసి, మృతదేహాలను బయట విసిరి కొడితే, ఒక్కరూ స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *