చినాబ్ ‘అద్భుతం’ వెనుక తెలుగు మహిళ
దేశానికే గర్వకారణంగా నిలిచిన చీనాబ్ రైల్వే వంతన నిర్మాణంలో ముఖ్యభూమికను పోషించారు తెలుగు తేజం, మహిళా ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలత. ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తైన ఈ ఇంజనీరింగ్ అద్భుత వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించి జూన్ 06, 2025న జాతికి అంకితమిచ్చారు.
సాదాసీదాగా కనిపించే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్నారు. 2000ల సంవత్సరంలోనే ఆ కలకు ఊపిరి ఊదారు.. తన 17 సంవత్సరాల కృషి ఎట్టకేలకు సాకారం కావడంతో మాధవిలత ఆనందానికి గురయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సాంకేతిక సహాయాన్ని అందించిన బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కు చెందిన జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాధవీలత గురించి మరింత తెలుసుకుందాం.
ప్రొఫెసర్ మాధవీలత ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామంలోజన్మించారు. సాధారణ రైతుకుటుంబం తనది. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి. కాకినాడలో 1992లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జెఎన్టీయు) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చేశారు. ఆ ఊరునుంచి తొలి ఇంజనీర్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆమె ఎన్‌ఐటీ వరంగల్ నుంచి జియోటెక్ని కల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పట్టా పొందారు. అక్కడే బంగారు పతకాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమె ఐఐటీ మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి సాధించారు. చీనాబ్ వంతెన ప్రాజెక్టుతో ప్రొఫెసర్ మాధవీలత అనుబంధం అదే సంవత్సరంలో ప్రారంభంలో ప్రారంభమైంది. నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు నిరంతర సాంకేతిక సహాయాన్ని ఆమె ప్రభుత్వానికి అందించారు. మాధవిలత సహాయ సహాకారాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. స్వయంగా ఎన్నోసార్లు చీనాల్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. పరిశీలన జరిపి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. నిర్మాణాత్మక సమాలోచనల్లో భాగస్వాములయ్యారు. అక్కడి భూమి స్వభావాన్ని అర్థం చేసుకొని అందుకు అనుగుణమైన ముడి సరులకు వినియోగం, నిర్మాణ కొలతలు, వాటి రూపు రేఖలను గురించి సలహాలు, సూచనలను పంచుకున్నారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కట్టడం నిర్మించడం అంటే మాటలు కాదు. అందుకు తపన ఉంటే సరిపోదు. సరైన అవగాహన, అందుకు సంబంధించిన విషయ అనుభవం కూడా ఎంతో అవసరం. చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదాలను తీసుకొస్తుంది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, భూ ప్రకంపన లను తట్టుకోగలిగేలా పునాదులను రూపొందిం చడంలో సహకారించడం ద్వారా ఆమె మొదటి విజయం సాధించారు. పటిష్టమైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం మాధవిలత అనుభవాన్ని మన కళ్ళకు కడుతుంది. ఈ రంగంలో దశాబ్దాలుగా ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు అలంకారంగా మారాయి. అది మాత్రమేనా ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డును కూడా అందుకున్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని స్టెమ్ విభాగంలో టాప్ 75 మహిళల్లో ఒకరిగా నిలిచారు. నేడు ఐఐఎస్సీలో భావి ఇంజనీర్లకు హెచ్‌ఏజీ గ్రేడ్ ప్రొఫెసరుగా మార్గదర్శనం చేస్తున్నారు. సమర్థులనే సవాళ్ళు పలకరిస్తాయనేందుకు ఈ నారీ శక్తి ఓ చక్కటి ఉదాహరణ.
దేశ చరిత్రలో గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది. ప్రొఫెసర్ మాధవిలత భారతీ యుల గుండెల్లో గుర్తుగా మిగిలిపోతుంది.