చింతాకు
కూరగాను, పచ్చడిగాను దీనిని ఉపయోగిస్తారు. దీని లేత చిగురుని చింతచిగురు అంటారు. ఈ చింతచిగురు హృదయానికి మేలు చేస్తుంది. ఇది వగరు, పులుపుగా ఉంటుంది. రుచిని పుట్టిస్తుంది. బుద్ధికి మేలు చేస్తుంది. జీర్ణక్రియకు మంచిది. కఫ, వాతాలని అద్భుతంగా తగ్గిస్తుంది.
చింతచిగురు ఎక్కువగా వేసవికాలంలో దొరకుతుంది. చింతచిగురు శరీరానికి వేడిచేస్తుంది అనుకుంటారు. కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదు. చింతచిగురు వాత వ్యాధులని, మూలరోగాన్ని, శరీరంలో ఏర్పడే గుల్మాలను తగ్గిస్తుంది. పైత్యం, వికారములను తగ్గిస్తుంది.
కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు. ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు. ఒంగోలు ప్రాంతంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పొడికూర చాలా మంచిది. చింతాకు రసంలో పసుపు కలుపుకుని తాగితే మసూచికా వ్యాధి నివారణ అవుతుంది. మోకాళ్ళ వాపు తగ్గడానికి చింతాకు ముద్దగా చేసి నీళ్లతో నూరి పట్టు వేయవచ్చు.
మొండి వ్రణాలను చింతాకు కషాయంతో కడిగితే అవి త్వరగా నయం అవుతాయి.
ఎర్రగా కాల్చిన ఇనుప గరిటె చింతాకు రసంలో ముంచి ఆ రసం వేడిగా ఉండగానే తాగితే అజీర్తి విరేచనాలు తగ్గుతాయి.
గమనిక: నేత్ర వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినరాదు. ఇది జఠరాగ్నిని కూడా తగ్గిస్తుంది.
– ఉషాలావణ్య పప్పు