చిప్కో – మహిళా పర్యావరణ ఉద్యమం
ప్రపంచంలోనే చాలా అరుదైన సత్యాగ్రహ మార్గంలో అహింసాయుతంగా స్త్రీలు జరిపిన అటవీ-సంపద పరిరక్షణ ఉద్యమంగా ‘చిప్కో’ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రకృతికి ప్రతీకలైన స్త్రీలు, ఆ ప్రకృతిని- పర్యా వరణాన్ని కాపాడిన ఈ చరిత్రని ‘ఇకో-ఫెమినిజం’ అని పలువురు ప్రశంసించారు. పురుషులు నేతృత్వం వహించినా, ఉద్యమానికి భూమికగా, వెన్నెముకగా ఉండి నడిపించినది స్త్రీలే.
అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో(నేటి ఉత్తరా ఖండ్), ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో, ప్రకృతి రమణీయంగా ఉండే గడ్హ్వాల్ ప్రాంతం, చమోలీ జిల్లాలో, 1973లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. దీని వెనుక ఎంతో నేపధ్యముంది. భూ కంపాలు లాంటి ప్రమాదాలు జరిగే అవకాశమున్న హిమాల యాల్లో, అటవీ నిర్మూలన విపరీతంగా సాగి, పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటున్న దశలో, 1970లో బదరీనాథ క్షేత్రం వద్దనున్న హనుమానచట్టి స్థానం నుంచి, దాదాపు 350కి.మీ దూరంలోని హరిద్వార్ దాకా, అలకనందా నదికి భారీ వరదలు వచ్చాయి. గ్రామాలు, రహదారులు, వంతెనలు కుప్పకూలిపోయాయి.
200పైగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. అంతకుముందే ప్రముఖ గాంధేయవాది శ్రీ చండీప్రసాద్ భట్ట్ గోపేశ్వర్ గ్రామంలో, ‘దశోలి గ్రామస్వరాజ్య సంఘం’ స్థాపిం చారు, స్థానికంగా దొరికే వనరులతో, వ్యవసాయా నికి కావలసిన పనిముట్లు తయారు చేసుకుని, ప్రజలు ఉపాధి, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాలని వారి ధ్యేయం. 1973లో గ్రామస్థులు స్థానికంగా వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవడానికి కలప నిరాకరించిన ప్రభుత్వం, ‘సైమన్ కంపెనీ’ అనే క్రీడా ఉత్పత్తుల కంపెనీకి, టెన్నిస్ ఆడే బాట్ల తయారీకి, 300 చెట్లు నరకడానికి అనుమతిం చింది. అసలే వరదలతో నాశనమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరింత ప్రకృతి వినాశనాన్ని ఇంక తట్టుకోలేదని, ప్రజలు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏప్రిల్ 1973లో ప్రతిఘటించి, చెట్ల నరికివేత ఆపించారు. అయితే ఇదే కంపెనీకి, జూన్1973లో కొంచెం దూరంలో ఉన్న ‘ఫాట’ గ్రామంలో, అటవీ నిర్మూలనకి మళ్ళి అనుమతిని చ్చారు. తరువాత మళ్ళీ అలకనందా నది పైభాగంలోని ‘రేని’ గ్రామంలో 2500 చెట్లు నరక డానికి అనుమతులు వచ్చాయి. ఇంక లాభం లేదని ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు ఈ గ్రామాలకు మూకు మ్మడిగా వెళ్లి, చెట్లను హత్తుకుని (చిప్కో అంటే హిందీలో అతుక్కోవడం) నిలబడి, చెట్లను నరకనివ్వ కుండా కాపాడ గలిగారు.
పూర్తిగా శాంతియుతంగా సత్యాగ్రహ మర్గాన స్త్రీల ఉద్యమం సాగింది. 1973-79 మధ్య కాలంలో, వందలాది గ్రామాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. క్రమక్రమంగా ఉద్యమం ఉత్తర భారతమంతా విస్తరించింది.
మరొక ప్రముఖ గాంధేయవాది
శ్రీ సుందరలాల్ బహుగుణ (ఇటీవల మే 2021లో ఈయన మరణించారు. భారత ప్రభుత్వం ఈయనకి పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది) ప్రజలకు పర్యావరణ పరిరక్షణ గురించి బోధించి, 2వారాలపాటు నిరాహారదీక్ష జరిపి, ఈ స్త్రీల-ప్రకృతి ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చి, అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మెడలు వంచి, చివరికి పర్యావరణ విధ్వంసాన్ని నివారించ గలిగారు. అంతగా పర్యావరణ స్పృహ లేని ఆ రోజుల్లో ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
చిప్కో ఉద్యమ స్ఫూర్తి
చిప్కో సత్యాగ్రహ ఉద్యమం ఆనాడే కాదు, ఇవాళ కూడా మనకు మన ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం. అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ప్రకృతితో మమేకమై జీవించడం మొదలైన ఎన్నో పాఠాలు మనకు ఈ ఉద్యమం నేర్పిస్తుంది.
ప్రకృతిని అడ్డుఆపు లేకుండా కొల్లగొడితే ఎంతటి విధ్వంసం, విలయం సృష్టించి, ప్రజల ప్రాణాలు పోవడమేకాక, దేశ ఆర్థిక వ్యవస్థలే చిన్నా భిన్నమైపోతాయి. విపరీతంగా జనాభా పెరిగి, అడవులను పశుపక్ష్యాదులను నాశనం చేసి, పర్యా వరణ సమతుల్యత కోల్పోయి దేశ మనుగడ, భవిష్య త్తును దెబ్బతీసే స్థాయికి చేరుకుంటున్నాము.
పర్యావరణ సమతుల్యత, ప్రకృతితో సహజీవనం మన హిందూ సంస్కృతిలో అంత ర్భాగం. పర్యా వరణ వినాశనం అంటే మానవాళి వినాశనం.
– ప్రదక్షిణ