చిర్రికూర
దీనిని సంస్కృతంలో మేఘనాధ, భండీర, విషఘ్న , కచర అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీనికి పథ్య శాకం అని పేరు కూడా ఉంది. అంటే అన్ని రకాల వ్యాధుల్లో దీనిని ఉపయోగించవచ్చు అని అర్ధం. ఇది కొద్దిపాటి తేమగల ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. ఇది చూడటానికి ముళ్లతోట కూరలా ఉంటుంది. దానిలా ముళ్ళు ఉండవు.
చిర్రికూరలో మూడురకాల జాతులు ఉన్నాయి-చిర్రి, నీటి చిర్రి, చిన్న చిర్రి. వైద్యగ్రంధాలలో మాత్రం నీటిచిర్రి గురించి ఉంది. కాని వంట కాలలో ఉపయోగిస్తున్నట్టు ఎక్కడా కనపడదు.
వైద్యగ్రంధాలలో వివరించినదాని ప్రకారం పిత్తాన్ని, కఫాన్ని, రక్తదోషాన్ని పోగొడుతుంది. మలమూత్రాలను బాగా బయటకి పంపిస్తుంది. నాలుకకు రుచిని పుట్టిస్తుంది. రక్తం కక్కే వ్యాధిని పోగొడుతుంది. శరీరంలో జఠరాగ్ని పెంచుతుంది.
చిర్రికూర పాషాణాది విషాన్ని, సర్ప విషాన్ని మొదలయిన విషాలను హరిస్తుంది అని పేరు కలదు. విషంతో కూడిన రక్తాన్ని శుభ్రపరచడంలో దీనికి మంచి పేరు ఉంది. ఈ కూర బాగా ఆకలి కలిగిస్తుంది. వాత, పిత్త, శ్లేష్మాలు అనే త్రిదోషాలను నివారిస్తుంది. కళ్ళజబ్బులు, మెదడు జబ్బులు కలవారికి ఇది మిక్కిలి హితకరమైనది. రక్తం కక్కుకునే వ్యాధుల్లో, గుండెజబ్బుల్లో చిర్రిఆకుకూర చాలా ఉపయోగి కారిగా ఉంటుంది. ఈ కూర తినటం వలన అతిసార వ్యాధి తగ్గుతుంది.
– ఉషాలావణ్య పప్పు