అసదుద్దీన్ చర్యపై రాష్ట్రపతికి సీనియర్ లాయర్ ఫిర్యాదు
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో జై పాలస్తీనా అంటూ ఒక పరాయి దేశానికి అనుకూలంగా నినాదం చేయడంపై సీనియర్ లాయర్ హరిశంకర్ జైన్ రాష్ట్రపతి ముర్ముకి ఫిర్యాదు చేశారు. పాలస్తీనా విదేశమని పేర్కొంటూ… ఓవైసీ ఒక పరాయి దేశానికి కట్టుబడి ఉన్నట్లు పార్లమెంటు సాక్షిగా అంగీకరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డి) ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ తక్షణం పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడవుతాడని ఆ ఫిర్యాదులో తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన నినాదం దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు అనీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 r/w 103 ద్వారా ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓవైసీ.. పాలస్తీనా పట్ల అసదుద్దీన్ విధేయతను చూపుతున్నారని.. ఇలా వ్యవహరించడం తొలిసారి కాదని మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 18వ లోక్‌సభకు ఎన్నికైన అసదుద్దీన్ ఒవైసీ “జై పాలస్తీనా” నినాదాన్ని లేవనెత్తినందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 1(డి) ప్రకారం అనర్హులుగా ప్రకటించబడాలని ఫిర్యాదులో తెలుపారు. ప్రస్తుత ఫిర్యాదులో పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద అసదుద్దీన్ ఓవైసీ అనర్హతపై భారత ఎన్నికల సంఘానికి సూచించాలని హరిశంకర్ జైనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోక్‌సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రమాణ స్వీకారం చివర్లో ఓవైసీ జై భీమ్ – జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. అయితే మన దేశ లోక్‌సభలో “జై పాలస్తీనా” అని అసదుద్దీన్ నినాదం చేయడం మాత్రం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే అప్పుడే ఈ నినాదంపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు ఓవైసీ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించడంతో బీజేపీ సభ్యులు తాత్కాలింగా శాంతించారు. అయితే, ఓవైసీ ఇలా అనడం పట్ల అటు అధికారపార్టీ నేతలే కాక చాలామంది జాతీయవాదులు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి అసద్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు స్పీకర్‌కు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇదే వ్యవహారంపై కొందరు న్యాయవాదులు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పాలస్తీనాకు అనుకూలంగా జై పాలస్తీనా అంటూ ఆ దేశానికి కట్టుబడి ఉన్నందుకు అసదుద్దీన్ ఒవైసీ తన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు అంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ వేదికగా ఇప్పటికే పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (డీ) ప్రకారం అసదుద్దీన్ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై సుప్రీంకోర్టు లాయర్ అలోక్ శ్రీవాస్తవ ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.