దాంపత్య జీవనం మన బలం
కుటుంబప్రబోధన్
మనది ఋషుల భూమి, మనదైన జీవన విధానం వేల సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగిపోవడానికి మన ఋషులు మనకందించిన సంస్కారాలే కారణం. ఆదిఋషి వశిష్ఠుడు, వారి ధర్మపత్ని అరుంధతి వీరు ఋషిదంపతులు. దాంపత్య ధర్మం వీరి ద్వారా ఉపదేశింపబడిరది. దీన్ని ఆదర్శవంతంగా ఆచరించారు సీతారాములు. వివాహం ఒక సంస్కారం, దాంపత్యం ఆదర్శవంత మైనది. సృష్టి క్రతువును సదాచారంతో నిర్వహించేం దుకు దాంపత్యం ఒక సాధనం. ధర్మార్థ కామమోక్షాలను చక్కగా ఆచరించడానికి దాంపత్యం ఒక క్రమశిక్షణ కల్గిన మార్గం. భారతీయ ధర్మంలో స్త్రీ పురుషులు సమానం. అర్థనారీశ్వర తత్త్వం మనకు ఆ విషయమే తెలియజేస్తుంది.
శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకొన్నాడు. పాల సముద్రంలో శేషతల్పముపై నిదురించే విష్ణువు ధర్మాచరణలో నిమగ్నమై ఉన్నాడు. కనుకనే లక్ష్మి పాదాల వద్దకు చేరి సేవలందిస్తుంది. ధర్మాచారణ చేస్తే సంపద అదే వస్తుందన్నమాట. కానీ సంపద కోసం పతిని అధర్మాచరణకు ధర్మపత్ని ప్రేరేపించగూడదు. ఒకరికొకరు తోడుగా ఉండి కష్టనష్టాలను సహేతుకంగా, సమానంగా పంచుకొని జీవించేవారే ఆదర్శ దంపతులు. అనుసూయ, అత్రి మహర్షులది ఆదర్శ దాంపత్యం. జీవితంలో ఎందరు తారసపడినప్పటికి, సామాజిక మాధ్యమాల్లో ఎందరు మిత్రులయినప్పటికీ, భార్యభర్తలిద్దరూ ఒకరికొకరు చివరివరకు జీవించే ఆదర్శస్నేహితులు. ఇదో పవిత్ర బంధం. ‘సూర్యుడి నుంచి వెలుగును వేరు చేయలేనట్లే సీతను నానుండి ఎవరూ వేరు చేయలేరు’ అంటాడు శ్రీరాముడు. పరస్పర విరుద్ధమైన ధర్మార్థ కామాలను సమన్వయం చేయగలిగిన శక్తి భార్యకే ఉందని మహాభారతం చెబుతుంది. దాంపత్య జీవితంలో మనోనియంత్రణ, కరుణ కల్గి ఉండడం, దానం చేయడం వంటి 3 విషయాలను పెద్దలు దంపతులకు సూచించారు. అందుకే వివాహ సమయంలో వరుణ్ణి బ్రహ్మ, విష్ణు, మహేర్వులరుగా భావిస్తే, వధువును సరస్వతి, లక్ష్మి, పార్వతిగా పరిగణిస్తారు. కాని వివాహం ద్వారా దంపతులయినవారికి సత్కర్మాచరణయే ప్రథమ కర్తవ్యం. 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు సంసార జీవితం సాగించడం భారతదేశంలో దంపతులకు చాలా సహజంగా కనిపించే విషయం. ఇది విదేశాల్లో కనపడదు. దంపతులు ఆహార నియమాలను విష్ణుపురాణం వివరించింది. ప్రాణికోటి తల్లిని ఆశ్రయించినట్లే బిచ్చగాళ్ళ అవసరం తీర్చడాన్ని గృహస్థులు కనీసధర్మంగా ఆచరించాలని వైఖానస సూత్రం చెబుతుంది. వివాహానికి ఏ జంట తగినదో, ఏది తగనిదో యూజ్ఞవల్క మహర్షి చెప్పారు. మాతృత్వం సఫలం కావడానికి దాంపత్య జీవనం బాగుండాలి. అన్యోన్య దాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ఆదర్శం. వారు ఆది దంపతులు, ఆదర్శ దంపతులు.
తమ పిల్లల్ని ప్రయోజకులుగా, సంస్కార వంతులుగా, దేశ ప్రేమికులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా దంపతులకున్నది. కష్టాలలో, సుఖాలలో ఒక తీరుగా స్పందించే సామర్థ్యం కుటుంబంలో వెల్లివిరియా లంటే దాంపత్య జీవనం ఆదర్శంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకునే రీతిలో సంసారం సాగాలి. ‘అందుకే నేను చెప్పినట్లే నడుచుకోవాలి, నాకు కావాల్సిందే చేయాలి’ అనకుండా ఎవరి ఆలోచనలు, భావాలను వారు పరస్పరం అభిమానించి ఆదరించి, ఆచరణ కందివచ్చేలా చేసుకుంటూ సాగడమే నిజమై ప్రేమ అంటారు స్వామి వివేకానంద. అదే మన బలమవు తుంది. కుటుంబ జీవానాన్ని బలోపేతం చేస్తుంది.
– హనుమత్ ప్రసాద్