అయోధ్య రామ మందిరానికి రక్షణ గోడ నిర్మాణం
అయోధ్యలోని శ్రీ రామ మందిరానికి రక్షణ గోడ నిర్మించనున్నారు. ఈ నిర్మాణం ఈ నెల నుంచే ప్రారంభం అవుతుంది. మందిరానికి ప్రహారీ గోడ నిర్మించాలని రక్షణ నిపుణులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 80 నుంచి 90 కోట్లను కూడా కేటాయించారు. రాబోయే 15 రోజుల్లో నిర్మాణం ప్రారంభం అవుతుంది. పూర్తి కావడానికి 8 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆలయ సముదాయంలోని ఉత్తరం వైపు నుంచి నిర్మాణం ప్రారంభమై.. మొత్తం దేవాలయం కవర్ అయ్యేట్లు.. దశల వారీగా దీనిని చేస్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. 14 నుంచి 16 అడుగుల ఎత్తులో మూడు అడుగుల ఉక్కు కంచెతో ఈ గోడను నిర్మిస్తారు.
అలాగే అధునాతన నిఘా పరికరాలు, వాచ్ టవర్లను కూడా ఏర్పాటు చేస్తారు. దీని నిర్మాణ బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ తీసుకుంది. అనధికారికంగా దేవాలయంలోకి ఎవ్వరూ చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ట్రస్ట్ తెలిపింది.
ఇప్పటికే రెండు సార్లు అనుమానితులు ఫోన్లు చేసి, బెదిరింపులకు దిగినట్లు వార్తలొచ్చాయి. అలాగే ప్రజలు, దేవాలయ రక్షణ నేపథ్యంలో ప్రహారీ గోడ అత్యావశ్యకమని రక్షణ నిపులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయాన్ని యూపీ పోలీసులు, సీఆర్పీఎఫ్ పహారా కాస్తోంది.