ములుగులో రికార్డు… తొలి కంటెయినర్ పాఠశాల ఏర్పాటు
ములుగు జిల్లా సరికొత్త రికార్డును నెలకొల్పింది. తొలి కంటైనర్ స్కూల్ అక్కడ ప్రారంభమైంది. ఈ స్కూల్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి గ్రామంలో 13 లక్షలతో దీనిని ఏర్పాటు చేశారు. అక్కడ నడుస్తున్న పాఠశాల పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంది. అటవీ ప్రాంతం కావడంతో పాఠశాలకి నూతన భవనం నిర్మించుకుంటామని చెబితే… అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. అనుమతులు ఇవ్వనే లేదు. దీంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు వుంటుంది. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. ఈ గూడాలన్నీ కూడా రిజర్వ్ అటవీ ప్రాంతం పరిధిలోనివి. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు మంజూరు కావు. రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పాఠశాల ఏర్పాటుతో అక్కడి వనవాసీ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
ప్రత్యేకంగా చొరవ తీసుకున్న కలెక్టర్
వర్షాకాలంలో తమకు తీవ్ర ఇబ్బంది అవుతోందని, ఎప్పుడు పాఠశాల భవనం కూలుతుందోనన్న భయం వుందని, కొత్త భవనం నిర్మించాలని స్థానిక వనవాసీలు కలెక్టర్ ను కోరారు. అయితే.. అనుమతులు రావడం కుదరలేదు. దీంతో అక్కడి కలెక్టర్ దివాకర్ అత్యంత వినూత్నంగా ఆలోచించారు. శాశ్వతమైన భవనం కాకుండా కంటెయినర్ పాఠశాల అయితే బాగుంటుందని ఆలోచించారు. వెంటనే తన నిధుల నుంచి 13 లక్షలు కేటాయించి, కంటెయినర్ స్కూల్ ఏర్పాటు చేయించారు. ఈ మిషన్ కి మంత్రి సీతక్క కూడా సహకరించడంతో ఇది సక్సెస్ అయ్యింది.
కంటెయినర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు…
ఇక.. ఇదే జిల్లాలో కంటెయినర్ హాస్పిటల్ ను కూడా ఏర్పాటు చేశారు. పోచాపూర్ గ్రామంలో స్థానిక వనవాసీలకు వదై్య సేవలు అందించేందుకు కలెక్టర్ ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. వనవాసీలు వైద్య కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రాణాలు కోల్పోడం తరుచూ జరుగుతూనే వున్నాయి. దీంతో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని, దీనిని ఏర్పాటు చేశారు.